ముంబై, అక్టోబర్ 23: దేశీయ స్టాక్ మార్కెట్ల లాభాల పరంపర కొనసాగుతున్నది. ఐటీ, టెక్నాలజీ షేర్లకు మదుపరుల నుంచి లభించిన మద్దతుతో సూచీలు జోరందుకున్నాయి. ఇంట్రాడేలో 52 వారాల గరిష్ఠ స్థాయికి చేరుకున్న సూచీలకు రష్యాకు చెందిన రెండు చమురు కంపెనీలపై అమెరికా ఆంక్షలు విధించడంతో ఈ భారీ లాభాలను నిలుపుకోలేకపోయింది. ఈ ఆంక్షల నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీ షేరు ఒక్క శాతానికి పైగా నష్టపోవడం సూచీలపై ప్రతికూల ప్రభావం చూపాయి. దీంతో ఇంట్రాడేలో 900 పాయింట్ల వరకు లాభపడిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 130.06 పాయింట్ల లాభంతో సరిపెట్టుకున్నది.
మార్కెట్ ముగిసే సమయానికి సూచీ 84,556.40 వద్ద స్థిరపడింది. మరో సూచీ నిఫ్టీ 22.80 పాయింట్లు అందుకొని 25,891.40 వద్ద నిలిచింది. ప్రారంభంలో భారీగా కొనుగోళ్లు జరిపిన మదుపరులు చివర్లో ప్రాఫిట్ బుకింగ్‌కు మొగ్గుచూపడంతో సూచీలు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి..అమెరికా-భారత్ దేశాల మధ్య జరుగుతున్న వాణిజ్య చర్చలు వాయిదాపడే అవకాశాలుండటం, రష్యా చమురుపై ఆంక్షలు విధించడంతో సూచీలపై ప్రతికూల ప్రభావం చూపాయని దలాల్‌స్ట్రీట్ వర్గాలు వెల్లడించాయి.
విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు మళ్లీ పెట్టుబడులు పెడుతుండటం, కార్పొరేట్ల ఆశాజనక ఆర్థిక ఫలితాలు, జీఎస్టీ తగ్గుదలతో వరుసగా ఆరు రోజు కూడా పెరిగింది. ఇన్ఫోసిస్ షేరు 3.86 శాతం లాభపడి టాప్ గెయినర్‌గా నిలిచింది. దీంతోపాటు హెచ్‌సీఎల్ టెక్నాలజీ, టీసీఎస్, యాక్సిస్ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంక్, టైటాన్, టెక్ మహీంద్రా షేర్లు కూడా లాభాల్లో ముగిశాయి. కానీ, ఎటర్నల్, అల్ట్రాటెక్, భారతీ ఎయిర్టెల్, అదానీ పోర్ట్స్ షేర్లు నష్టపోయాయి. రంగాలవారీగా ఐటీ 2.36 శాతం, టెక్నాలజీ 1.17 శాతం, బ్యాంకింగ్, మెటల్, ఎఫ్ఎంసీజీ రంగ షేర్లు కదంతొక్కాయి.