ఊహించినట్టుగానే గత వారం మార్కెట్ మరింత పతనమైంది. చివరి మూడు రోజుల్లోనే ప్రధాన సూచీ నిఫ్టీ దాదాపు 600 పాయింట్లకుపైగా దిద్దుబాటుకు గురైంది. గురువారం 300 పాయింట్లకుపైగా క్షీణించడంతో మార్కెట్ నష్టాలు మరింత పదునెక్కాయి. అక్టోబర్ నెల చార్ట్‌లో ‘షూటింగ్ స్టార్ బేరిష్ క్యాండిల్’ ఏర్పడింది. దీనికితోడు 20 రోజుల చలన సగటు దిగువకు పడిపోయింది. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు కూడా వారాంతపు, నెలసరి చార్ట్‌లలో స్పష్టమైన బేరిష్ క్యాండిల్స్‌ను ఏర్పాటు చేశాయి. 95 శాతం మార్కెట్ క్యాపిటలైజేషన్ను కలిగి ఉన్న నిఫ్టీ-500 ఇండెక్స్ కూడా బేరిష్ ప్యాట్రన్‌ను ఏర్పాటు చేసింది. దీంతో అక్టోబర్‌లో తాకిన గరిష్ఠ స్థాయి 18,604 పాయింట్లను మళ్లీ అధిగమించడం అంత సులభంగా కనిపించడం లేదు. విదేశీ సంస్థాగత మదుపరులు అక్టోబర్‌లో రూ.25,572.19 కోట్ల భారీ అమ్మకాలను జరిపారు. ఈ ఏడాది జూలై నెలలో విక్రయించిన రూ.23,193.39 కోట్ల కన్నా ఇది అధికం. దీంతో గత వారంలో ప్రధాన సూచీలు నిఫ్టీ, సెన్సెక్స్‌లు రెండున్నర శాతం చొప్పున పతనమయ్యాయి. ఒక్క పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ మినహా మిగతా అన్ని సెక్టార్ల ఇండెక్స్‌లు కనీసం మూడున్నర శాతానికిపైగా నష్టపోయాయి. వచ్చే వారం నిఫ్టీలో రికవరీ కనిపించకపోతే మార్కెట్ పతనం కొనసాగుతుంది. 50 రోజుల చలన సగటు మద్దతు ప్రస్తుతం 17,565 వద్ద ఉంది. అలాగే క్రితం స్వింగ్ కనీస స్థాయి 17,452 వద్ద ఉన్నది. ఈ రెండు స్థాయిల కన్నా దిగువకు నిఫ్టీ పడిపోతే మార్కెట్ డౌన్ ట్రెండ్ అవుతుంది. మరింత పతనమయ్యే ముందు షార్ట్ కవరింగ్ కారణంగా మార్కెట్లో చిన్న బౌన్స్ వచ్చే వీలున్నది. 18,342 స్థాయికి ఎగువన క్లోజ్ అయితేనే మార్కెట్ మళ్లీ బుల్ ట్రెండ్‌లోకి ప్రవేశిస్తుంది.