ముంబై, డిసెంబర్ 22: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా రెండోరోజు లాభాల్లో ముగిశాయి. ఒమిక్రాన్ వైరస్ విజృంభిస్తున్నప్పటికీ అంతర్జాతీయ మార్కెట్లు భారీగా లాభపడం దేశీయ సూచీలకు దన్నుగా నిలిచాయి. గత కొన్ని రోజులుగా భారీగా పతనమైన రూపాయి కోలుకోవడం మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచింది. 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 611.55 పాయింట్లు(1.09 శాతం) లాభపడి 56,930.56లకు చేరుకోగా, జాతీయ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ 184.60 పాయింట్లు అందుకొని 16,955.45 వద్ద ముగిసింది. మార్కెట్లో అత్యధికంగా బజాజ్ ఫైనాన్స్ 2.94 శాతం పెరిగి టాప్ గెయినర్‌గా నిలిచింది. దీంతోపాటు భారతీ ఎయిర్టెల్, సన్‌ఫార్మా, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎస్బీఐ, ఎల్అండ్టీ, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, మారుతి, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్, మహీంద్రా, ఇన్ఫోసిస్, రెడ్డీస్, టీసీఎస్, టైటాన్లు లాభపడ్డాయి. కానీ, విప్రో, ఐటీసీలు మాత్రం స్వల్పంగా నష్టపోయాయి.
వరుస నష్టాలతో భారీగా సంపదను కోల్పోయిన మదుపరులకు గత రెండు రోజుల్లో భారీగా కలిసొచ్చింది. వరుసగా రెండు రోజుల్లో సెన్సెక్స్ వెయ్యి పాయింట్లకుపైగా లాభపడటంతో మదుపరుల సంపద కూడా రూ.6,56,828.59 కోట్లు పెరిగింది. దీంతో బీఎస్ఈలో లిైస్టెన సంస్థల మార్కెట్ విలువ రూ.2,59,14,409.64 కోట్లకు చేరింది.