ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్లలో నూతన సంవత్సరం మొదలవబోతున్నది. కొత్త ఏడాదిపై మదుపరులు కోటి ఆశలు పెట్టుకుంటున్నారు. దీపావళి దృష్ట్యా మంగళవారం ప్రత్యేకంగా జరిగే మూరత్ ట్రేడింగ్‌తో సంవత్ 2082 ప్రారంభం కానున్నది. ఇక ఈ సెంటిమెంట్ ట్రేడింగ్‌లో సూచీలను లాభాల్లో పరుగులు పెట్టించడం సాధారణంగానే ఆనవాయితీ. సోమవారంతో ముగిసే సంవత్ 2081 ఆశించిన స్థాయిలోనైతే రాబడులను అందించలేదు. కాగా, ఇప్పటిదాకా మార్కెట్ ట్రెండ్‌ను గమనిస్తే.. అంతకుముందు వారం ముగింపుతో చూస్తే గత వారం సూచీలు భారీ లాభాలనే పొందాయి. సెన్సెక్స్ 1,451.37 పాయింట్లు లేదా 1.75 శాతం ఎగబాకి 83,952.19 వద్ద నిలిచింది. నిఫ్టీ సైతం 424.50 పాయింట్లు లేదా 1.67 శాతం ఎగసి 25,709.85 దగ్గర ముగిసింది. ఈ నేపథ్యంలో ఈ వారం కూడా మదుపరులు పెట్టుబడులకే పెద్దపీట వేస్తారన్న అంచనాలైతే ఉన్నాయి.
పండుగ సీజన్ అయినందున ఆటో, రియల్టీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ షేర్లు ఆకర్షణీయంగా ఉండవచ్చని ఈసారీ మెజారిటీ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇక ఎప్పట్లాగే గ్లోబల్ స్టాక్ మార్కెట్ల తీరుతెన్నులు, విదేశీ మదుపరుల పెట్టుబడులు, ముడి చమురు ధరలు, డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ, అంతర్జాతీయ పరిణామాలు ముఖ్యమే. ట్రంప్.. చైనాతో టారిఫ్ వార్‌కు కాలుదువ్వుతుండటం ఈక్విటీ మార్కెట్ మదుపరులను కలవరపెడుతున్నది. దీంతో ఇప్పటికే ఆల్‌టైమ్ హైల్లో కదలాడుతున్న బంగారం, వెండి ధరలు సరికొత్త స్థాయిలను తాకే వీలున్నది. కాగా, అమ్మకాల ఒత్తిడి కనిపిస్తే నిఫ్టీకి 25,400 పాయింట్ల స్థాయి కీలకమైనదనుకోవచ్చు. దీనికి దిగువన ముగిస్తే 25,200 పాయింట్ల స్థాయిని మద్దతుగా చెప్పుకోవచ్చని అత్యధిక నిపుణుల మాట. అయితే సూచీలు పరుగందుకుంటే ఈ వారం నిఫ్టీ 25,900-26,200 స్థాయికి వెళ్లవచ్చని కూడా చెప్తున్నారు. ఆల్‌టైమ్ హై స్థాయినీ అందుకోవచ్చు.
గమనిక..
స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్‌తో కూడుకున్నవి. దేశ, విదేశీ పరిణామాలు ట్రేడింగ్‌ను ప్రభావితం చేస్తుంటాయి. ఇక్కడ ఒడిదొడుకులు చాలా సహజం. పెట్టుబడులు పెట్టే ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం, ఆయా సాధనాల డాక్యుమెంట్లను క్షుణ్ణంగా చదువుకోవడం ఉత్తమం. అలాగే పైన పేర్కొన్న సూచనలు విశ్లేషకుల అభిప్రాయం మాత్రమే. దీనికి మా పత్రిక ఎటువంటి బాధ్యత వహించదు. ఎవరి పెట్టుబడులకు వారిదే పూర్తి బాధ్యత.