‘మేకిన్ ఇండియా’, ‘ఆత్మనిర్భర్ భారత్’ అంటూ గడిచిన పదేండ్లుగా ఊదరగొడుతున్న కేంద్రంలోని ఎన్డీయే సర్కారు ఆర్భాట ప్రచారమంతా ఉత్తదేనని తేటతెల్లమైంది. దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన తయారీ రంగం గతంలో ఎన్నడూ చూడని గడ్డుపరిస్థితిని ఎదుర్కొంటున్నది. ఉత్పాదక రంగంలో వృద్ధిరేటు ఏకంగా 12 నెలల కనిష్ఠాన్ని చేరుకోవడమే ఇందుకు రుజువు. డిసెంబర్లో మాన్యుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) 56.4కే పరిమితమైంది. కొత్త ఆర్డర్లు లేకపోవడంతో ఉత్పత్తిలో పెరుగుదల కనిపించకుండా పోయిందని హెచ్ఎస్బీసీ తాజా సర్వే తేల్చిచెప్పింది.
Make In India | న్యూఢిల్లీ, జనవరి 2/(స్పెషల్ టాస్క్ బ్యూరో): దేశ జీడీపీలో 17 శాతం వా టా కలిగిన తయారీ రంగం అంతకంత కూ కుదేలవుతున్నది. కొత్త ఆర్డర్లు లేకపోవడంతో పరిశ్రమల్లో ఉత్పత్తి దారుణంగా పడిపోతున్నది. దేశంలోని పరిశ్రమల్లో ఉత్పత్తి తీరుతెన్నులకు అద్దం పట్టే హెచ్ఎస్బీసీ-మాన్యుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) గణాంకాలే ఈ విషయాన్ని ధ్రువపరుస్తున్నాయి. కేంద్రంలోని ఎన్డీయే సర్కారు తీసుకొంటున్న విధానపరమైన నిర్ణయాల్లో లోపమే ఇందుకు కారణమని పారిశ్రామికవేత్తలు ఆరోపిస్తున్నారు.
తయారీ రంగానికి సంబంధించి పారిశ్రామిక ఉత్పత్తుల్లో వృద్ధిరేటును బేరీజువేసే మాన్యుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ మరింతగా పతనమైంది. గత నవంబర్‌తో పోలిస్తే మరింతగా తగ్గి డిసెంబర్లో 56.4కు పరిమితమైంది. ఇది 12 నెలల కనిష్ఠ స్థాయి కావడం గమనార్హం. తయారీ రంగంలో కొత్త అవకాశాలు సన్నగిల్లడంతో ఆర్డర్లు తగ్గి ఉత్పత్తిలో పెరుగుదల మందగించిందని సర్వే అభిప్రాయపడింది. భారతీయ మార్కెట్లో నెలకొన్న దుస్థితికి ఇది నిదర్శనంగా తెలుస్తున్నది. అంతకుముందు నెల నవంబర్‌లో 56.5 శాతంగా నమోదైన వృద్ధిరేటు మరింతగా తగ్గడంతో దేశంలో వ్యాపార-పారిశ్రామిక నిర్వహణ పరిస్థితులు ఇంకా దిగజారాయని సర్వే అభిప్రాయపడింది.
తయారీరంగం ఈ స్థాయిలో గడ్డుపరిస్థితులు ఎదుర్కోవడానికి 5 శాతం కంటే ఎక్కువగా కొనసాగుతున్న ద్రవ్యోల్బణం, పోటీ, ఒత్తిళ్లే కారణమని సర్వే అభిప్రాయపడింది. ప్రతీ పది కంపెనీలో కేవలం ఒక్క కంపెనీ మాత్రమే అదనపు కార్మికులను నియమిస్తుండగా, ప్రతీ పదిలో రెండు కంపెనీలు ఉద్యోగులను తీసివేస్తున్నట్టు సర్వే పేర్కొంది.
‘భారతీయ తయారీ రంగ కార్యకలాపాలు మందగమనంలో కొనసాగుతున్నాయి. గత ఏడాది వచ్చిన కొత్త ఆర్డర్లలో చెప్పుకోదగ్గ వృద్ధేమీ కనిపించలేదు. దీంతో ఉత్పాదక రంగంలో భవిష్యత్తు వృద్ధి బలహీనమే అని చెప్పవచ్చు’
– హెచ్ఎస్బీసీ ఎకనామిస్ట్ ఇన్స్ లామ్