Mutual Fund-KYC | ప్రతి ఒక్కరూ తమ ఆదాయంలో కొంత భాగం కుటుంబ అవసరాల కోసం మదుపు చేస్తుంటారు. ఫిక్స్డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెడుతుంటారు. ఏ పథకంలో మదుపు చేసినా కేవైసీ నిబంధనలు పాటించాల్సిందే. ఈ నిబంధన మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులకూ వర్తిస్తుంది. ఈ నెల ఒకటో తేదీ నుంచి కొత్తగా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టే మదుపర్లు తప్పనిసరిగా కేవైసీ నిబంధనలకు అనుగుణంగా పత్రాలు సమర్పించాల్సిందేనని స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ ‘సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ)’ స్పష్టం చేసింది. కేవైసీ కింద నివాస ధ్రువీకరణ, వ్యక్తిగత ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సిందేనని పేర్కొంది.
మ్యూచువల్ ఫండ్స్ సంస్థల ఆధ్వర్యంలోని కేవైసీ రిజిస్ట్రేషన్ ఏజెన్సీలను సెబీలో నమోదు చేస్తారు. కనుక మదుపర్లు తమ ఆధార్, పాస్ పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ గుర్తింపు కార్డు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కార్డు, కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. ఆ పత్రాల ఆధారంగా కేవైసీ ఫామ్ నింపి, సంబంధిత మ్యూచువల్ ఫండ్ సంస్థలో సమర్పించాలి. కేవైసీ నిబంధనల కింద యుటిలిటీ బిల్లులను, బ్యాంక్ స్టేట్మెంట్లను సెబీ పరిగణనలోకి తీసుకోబోమని తెలిపింది.
ఆన్ లైన్ లో మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్లు ఆధార్ బేస్డ్ ఈ-కేవైసీ సమర్పించాలి. కేవైసీ పత్రాలను ధ్రువీకరించిన తర్వాత ఆధార్‌తో అనుసంధానించిన మొబైల్ ఫోన్ నంబర్‌కు ఓటీపీ అప్ డేట్ చేస్తారు. అందుకోసం మొబైల్ ఫోన్ ద్వారా తమ లొకేసన్, మైక్రో ఫోన్ యాక్సెస్ కలిగి ఉండాలి. సెల్ఫ్ అటెస్టెడ్ పాన్ కార్డు పత్రం, డిజిటల్ కేవైసీ కోసం సిగ్నేచర్ ఇమేజ్ అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. కేవైసీ విజయవంతంగా పూర్తయిన తర్వాత మదుపర్లు తమకు నచ్చిన ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టొచ్చు.