న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: ఆదాయ పన్ను (ఐటీ) చెల్లింపుదారులు పాత ఐటీ చట్టం 1961లోని సెక్షన్లతో కొత్త ఐటీ బిల్లు 2025లోని క్లాజులను సరిపోల్చుకునే అవకాశాన్ని ఐటీ శాఖ కల్పించింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల దాదాపు 65 ఏండ్ల ఐటీ చట్టం స్థానంలో నూతన ఐటీ చట్టాన్ని పార్లమెంట్లో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే పాతదాంట్లో సెక్షన్లుంటే.. కొత్తదాంట్లో వాటికి బదులుగా కొన్ని క్లాజులను ప్రతిపాదించారు. దీంతో ఏ సెక్షన్.. ఏ క్లాజుగా మారిందో తెలియక ట్యాక్స్‌పేయర్స్ గందరగోళంలో పడిపోయారు. నిజానికి కొత్త ఆదాయ పన్ను విధానాన్ని ఎంచుకొనేవారికి ఈ సెక్షన్లతో ఎలాంటి పనీ లేదు. కానీ పాత ఆదాయ పన్ను విధానాన్ని అనుసరించేవారికి సెక్షన్లు తప్పనిసరి.
వయసు ఆధారంగా గరిష్ఠంగా ఆయా పొదుపు, పెట్టుబడులు, ఖర్చులు, చెల్లింపులపై రూ.11 లక్షల నుంచి 15 లక్షలదాకా పన్ను మినహాయింపు ప్రయోజనాలను పొందవచ్చు మరి. దీంతో కొత్త ఐటీ చట్టంలో కీలకమైన సెక్షన్లను క్లాజులుగా మార్చడంతో ట్యాక్స్‌పేయర్స్ ఐటీ రిటర్నుల సమయంలో ఇబ్బందిపడే ప్రమాదం ఏర్పడుతున్నది. దీనిపైన అటు ట్యాక్స్‌పేయర్స్ నుంచి ఇటు ఎక్స్పర్ట్స్ నుంచి ఆందోళనలు, విమర్శలూ వెల్లువెత్తాయి. ఇక ఇప్పటికే పాత ఆదాయ పన్ను విధానం జోలికి వెళ్లకుండా ప్రతీ బడ్జెట్లో కొత్త ఆదాయ పన్ను విధానంలోనే సవరణలు చేస్తూ వస్తున్న మోదీ సర్కారు.. పాత ఆదాయ పన్ను విధానానికి పూర్తిగా చరమగీతం పాడేందుకే ఈ కొత్త ఐటీ బిల్లు, సెక్షన్ల మార్పు చేపట్టిందన్న ఆరోపణలూ వచ్చాయి.
ఈ క్రమంలోనే సెక్షన్ టు క్లాజ్ అర్థం చేసుకునేలా ఐటీ శాఖ వెబ్సైట్లో పాత ఆదాయ పన్ను చట్టంతో కొత్త ఆదాయ పన్ను బిల్లును మ్యాపింగ్ చేస్తూ అప్లోడ్ చేశారు. పాత ఐటీ చట్టాన్ని సరళతరం చేస్తామని కొత్త ఐటీ బిల్లును ఈ నెల 13న లోక్‌సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ఇందులో 2.60 లక్షల పదాలు, 536 సెక్షన్లు, 23 చాప్టర్లు, 57 టేబుళ్లున్నాయి. అలాగే ట్యాక్స్ ఇయర్ విధానాన్ని పరిచయం చేశారు. ప్రస్తుత చట్టంలో ఆర్థిక సంవత్సరం (ఎఫ్వై), మదింపు సంవత్సరం (ఏవై)గా ఉండగా, వీటిని ట్యాక్స్ ఇయర్‌గా మార్చారు. ఏప్రిల్ 1 నుంచి మార్చి 31దాకా ఈ సంవత్సరాన్ని పరిగణిస్తారు. లోక్‌సభ సెలెక్ట్ కమిటీ, పార్లమెంట్ల ఆమోదం పొందితే వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి కొత్త ఐటీ బిల్లు అమల్లోకి రానున్నది.