TCS on Abroad Spending | విదేశాల్లోని పర్యాటక ప్రదేశాల సందర్శన.. విదేశీ స్టాక్స్ లేదా మ్యూచువల్ ఫండ్స్ లేదా.. క్రిప్టో కరెన్సీల్లో పెట్టుబడులు పెట్టినా.. మీ పిల్లల విదేశీ విద్య కోసం ఖర్చు చేసినా ఆదాయం పన్ను చట్టంలో పలు మార్పులు వచ్చాయి. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి విదేశాలకు ప్రయాణం నుంచి విదేశీ సంస్థల్లో పెట్టుబడులు.. విదేశీ విద్యాభ్యాసానికి చేస్తున్న ఖర్చుపై టాక్స్ కలెక్షన్ @ సోర్స్ (టీసీఎస్) నిబంధన అమల్లోకి వస్తుంది.
ఒక ఆర్థిక సంవత్సరంలో విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం కోసం వెళ్లిన విద్యార్థి కోసం తల్లిదండ్రులు రూ.7 లక్షల్లోపు ఖర్చు చేస్తే టీసీఎస్ వసూలు చేయరు. అలా కాకుండా బ్యాంకు లేదా బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ ద్వారా రూ.7 లక్షలపై చిలుకు రుణం తీసుకుంటే రూ.0.5శాతం, రుణం లేకుండా మొత్తం చెల్లిస్తే ఐదు శాతం టీసీఎస్ పే చేయాలి. విదేశాల్లో వైద్య సేవల కోసం రూ.7 లక్షలకు పైగా చెల్లించినా ఐదు శాతం టీసీఎస్ పే చేయాల్సిందే.
ఇప్పటివరకూ విదేశాల్లో క్రెడిట్ కార్డుతో జరిపిన లావాదేవీలపై ఎటువంటి టీసీఎస్ వసూలు చేయలేదు. కానీ అక్టోబర్ ఒకటో తేదీ నుంచి డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు సాయంతో రూ.7 లక్షలకు పైగా ఖర్చు చేసినా టీసీఎస్ 20 శాతం చెల్లించవల్సి ఉంటుంది. ఇక విదేశీ సంస్థల్లో వాటాలు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టో కరెన్సీ, రియాల్టీ రంగాల్లో రూ.7 లక్షలకు పైగా పెట్టుబడులు పెట్టినా 20 శాతం టీసీఎస్ నిబంధన వర్తిస్తుంది. విదేశీ పర్యాటక ప్రదేశాల సందర్శన టైంలో రూ.7 లక్షల్లోపు ఖర్చు చేస్తే 5 శాతం, దాటితే 20 శాతం టీసీఎస్ పే చేయాల్సి ఉంటుంది.
ఇతర అవసరాల కోసం రూ.7 లక్షల్లోపు నగదు ట్రాన్స్ఫర్ చేస్తే ఐదు శాతం, రూ.7 లక్షలు దాటితే 20 శాతం టీసీఎస్ వసూలు చేస్తారు. ఇక ఆర్బీఐ సరళీకృత చెల్లింపుల పథకం కింద ఒక ఆర్థిక సంవత్సరంలో 2.50 లక్షల డాలర్ల చెల్లింపులు చేసినా టీసీఎస్ నిబంధన అమల్లోకి వస్తుంది. వైద్యేతర, విద్యావసరాల కోసం రూ.7 లక్షలు చెల్లించినా 20 శాతం టీసీఎస్ వసూలు చేస్తారు. ఇలా చెల్లించిన టీసీఎస్ విషయమై పన్ను చెల్లింపుదారులు తమ ఐటీ రిటర్న్స్ లో నమోదు చేయడంతోపాటు రీఫండ్ క్లయిమ్ చేసుకుంటే సంబంధిత వ్యక్తుల ఖాతాల్లో మనీ క్రెడిట్ అవుతుంది.