Direct Tax Collection | గత ఆర్థిక సంవత్సరం (2022-23)తో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రత్యక్ష పన్నుల వసూళ్లలో 19.41 శాతం గ్రోత్ నమోదైందని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) గురువారం వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.14.70 లక్షల కోట్ల పన్ను వసూళ్లు జరిగాయని తెలిపింది. పూర్తి బడ్జెట్ అంచనాల్లో సుమారు 81 శాతం అని వివరించింది. జనవరి 10 నాటికి ప్రత్యక్ష పన్ను వసూళ్లు స్థిరమైన వృద్ధిరేటు కొనసాగిస్తున్నాయని సీబీడీటీ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రత్యక్ష పన్ను వసూళ్లు 2023-24 బడ్జెట్ అంచనాల్లో 80.61 శాతం గ్రోత్ నమోదైందనిపేర్కొంది.
ప్రత్యక్ష పన్ను వసూళ్లు (వ్యక్తిగత ఆదాయం పన్ను, కార్పొరేట్ టాక్స్) రూపేణా రూ.18.23 లక్షలు వసూలు చేయాలని బడ్జెట్ అంచనాల్లో గతేడాది ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఇది 2022-23 సంవత్సరం రూ.16.61 లక్షల కోట్లతో పోలిస్తే 9.75 శాతం ఎక్కువ. ఇక గతేడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఈనెల 10 వరకు ఐటీ రీఫండ్స్ రూ.2.48 లక్షల కోట్లు ఉంటాయి.
స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.17.18 లక్షలకోట్లు కాగా, గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 16.77 శాతం ఎక్కువ. స్థూల కార్పొరేట్ టాక్స్ (సీఐటీ) వసూళ్లు 8.32 శాతం, వ్యక్తిగత పన్ను ఆదాయం (పీఐటీ) వసూళ్లు 26.11 శాతం ఎక్కువ. రీఫండ్స్ సర్దుబాటు తర్వాత సీఐటీ వసూళ్లలో నికర వృద్ధిరేటు 12.37 శాతం, పీఐటీ వసూళ్లలో 27.26 శాతం నికర వృద్ధిరేటు నమోదైంది.