శనివారం 27 ఫిబ్రవరి 2021
Business - Nov 30, 2020 , 02:06:54

అప్పు కావాలా?

అప్పు కావాలా?

  • ఆపత్కాలంలో వెంటనే ఆదుకునే రుణాలు ఇవే 

కొవిడ్‌-19 మహమ్మారి మనకు చాలా పెద్ద గుణపాఠాన్ని నేర్పింది. దీని దెబ్బతో గత కొన్ని నెలల్లో చాలా మంది ఉద్యోగాలను కోల్పోయారు. మరెంతో మంది వేతన కోతలతో అల్లాడుతున్నారు. ఇలాంటి సంక్షోభాలను అధిగమించాలంటే ప్రతి ఒక్కరూ ముందుగానే అత్యవసర నిధిని కూడబెట్టుకోవాలి. కానీ ఈ విషయంలో చాలా మంది నిర్లక్ష్యం వహిస్తున్నారు. కేవలం కొద్ది మంది మాత్రమే ముందుచూపుతో వ్యవహరిస్తున్నారు. అత్యవసర నిధి లేనివారికి ఆపత్కాలంలో రుణమే ఏకైక మార్గం. ఎలాంటి ఆర్థిక విపత్కర పరిస్థితుల్లోనైనా మిమ్మల్ని వెంటనే ఆదుకునే ప్రధాన రుణాలు ఏమిటంటే..

వ్యక్తిగత రుణం

ఇవి అన్‌సెక్యూర్డ్‌ రుణాలు. వీటిని పొందేందుకు మీరు దేన్నీ తనఖా పెట్టాల్సిన అవసరం ఉండదు. గుర్తింపు, చిరునామా, ఆదాయ ధ్రువీకరణ లాంటి పత్రాలను సమర్పించి వ్యక్తిగత రుణాన్ని పొందవచ్చు. కానీ దరఖాస్తుదారుని రుణ చరిత్రను, క్రెడిట్‌ స్కోరును పరిశీలించిన తర్వాతే బ్యాంకులు వ్యక్తిగత రుణాన్ని మంజూరు చేస్తాయి. ఈ రుణాలకు వసూలుచేసే వడ్డీ అన్ని బ్యాంకుల్లో ఒకేలా ఉండదు. దరఖాస్తుదారుని క్రెడిట్‌ స్కోరు, తీసుకునే రుణ మొత్తం, దాన్ని తిరిగి చెల్లించే వ్యవధిపై వడ్డీ రేటు ఆధారపడి ఉంటుంది. స్థూలంగా చెప్పాలంటే ఏడాది నుంచి ఐదేండ్ల కాలపరిమితితో తీసుకునే వ్యక్తిగత రుణంపై వసూలుచేసే వార్షిక వడ్డీ 8.5 నుంచి 25 శాతం వరకు ఉంటుంది. వ్యక్తిగత రుణంపై చాలా బ్యాంకులు ప్రాసెసింగ్‌ చార్జీతోపాటు ప్రీపేమెంట్‌, పార్ట్‌-ప్రీపేమెంట్‌ ఫీజులను కూడా వసూలు చేస్తున్నాయి.

క్రెడిట్‌  కార్డుపై 


క్రెడిట్‌ కార్డులను జారీచేసే సంస్థలు సకాలంలో బాకీలను తీరుస్తున్న కార్డుహోల్డర్లకు ప్రీ-అప్రూవ్డ్‌ రుణాలను ఆఫర్‌ చేస్తాయి. ఇలాంటి రుణాల మంజూరుకు ప్రాసెసింగ్‌ సమయం చాలా తక్కువగా ఉంటుంది. దరఖాస్తు చేసిన తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే ఈ రుణాన్ని అందజేస్తారు. సాధారణంగా ఆరు నెలల నుంచి ఐదేండ్ల కాలపరిమితితో ఈ రుణం లభిస్తుంది. ఈ రుణాన్ని తీర్చేందుకు ఎంచుకున్న వ్యవధి, కార్డుహోల్డర్‌ క్రెడిట్‌ ప్రొఫైల్‌ను బట్టి వడ్డీ రేట్లు 10.99 శాతం నుంచి మొదలవుతాయి.

బంగారం తనఖాపై 


ఇవి చాలా సరళమైనవి. ఇటీవల పుత్తడి ధరలు భారీగా పెరిగినందున ఈ రుణం అధిక మొత్తంలో లభిస్తుంది. రుణదాతలతో మాట్లాడుకుని ఈ అప్పును సులభంగా తీర్చుకోవచ్చు. వ్యక్తిగత రుణాలతో పోలిస్తే బంగారం తనఖాపై ఇచ్చే రుణాలకు వడ్డీ చాలా తక్కువగా ఉంటుంది. ముత్తూట్‌ ఫైనాన్స్‌, మణప్పురం లాంటి బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ)ల కంటే బ్యాంకులే తక్కువ వడ్డీతో ఈ రుణాలను అందజేస్తున్నాయి. కానీ ఈ రుణాలను మంజూరు చేసేందుకు చాలా బ్యాంకులు అప్రైజల్‌ చార్జీలను వసూలు చేస్తున్నాయి. బ్యాంకును బట్టి ఈ చార్జీలు వేర్వేరుగా ఉంటాయి.

ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌పై

మీకేమైనా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ఉంటే అత్యవసర సమయాల్లో వాటిని కుదువపెట్టి సత్వర (ఇన్‌స్టంట్‌) రుణాన్ని పొందేందుకు వీలుంటుంది. మీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ విలువలో 90 నుంచి 95 శాతం వరకు మొత్తాన్ని రుణంగా పొందవచ్చు. సాధారణంగా బ్యాంకులు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లకు చెల్లించే వడ్డీ కంటే ఈ రుణానికి వసూలు చేసే వడ్డీ 2 శాతం ఎక్కువగా ఉంటుంది. ఆపత్కాలంలో ఆర్థిక అవసరాలను అధిగమించేందుకు ఈ రుణం ఎంతో అనువైనది.

నో-కాస్ట్‌ ఈఎంఐ

చాలా కంపెనీలు ఆఫ్‌లైన్‌తోపాటు ఆన్‌లైన్‌లో నో-కాస్ట్‌ ఈఎం ఐ (ఈక్వేటెడ్‌ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్‌) సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. ఈ ఆఫర్‌ను ఎంచుకున్నవారు ఏ వస్తువును కొనుగోలు చేసినా వడ్డీని చెల్లించాల్సిన అవసరం ఉండదు. అసలు మొత్తాన్ని నెలవారీ కిస్తీ (ఈఎంఐ)ల రూపంలో సులభంగా తీర్చేయవచ్చు. కానీ ఈఎంఐ సదుపాయాన్ని ఆఫర్‌చేసే సంస్థలు రహస్యంగా కొంత చార్జీని వసూలు చేస్తాయన్న విషయాన్ని ఎవరూ మరువకూడదు.


VIDEOS

logo