GoFirst Insolvency | ప్రైవేట్ ఎయిర్ లైన్స్ ‘గోఫస్ట్ (Go First)’ దాఖలు చేసిన స్వచ్ఛంద దివాళా పిటిషన్‌కు వ్యతిరేకంగా మూడు విమానాల లీజు సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లపై నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఈ నెల 22న ఉత్తర్వులు జారీ చేయనున్నది. మూడు పిటిషన్లపై సోమవారం ఎన్సీఎల్టీ చైర్ పర్సన్ జస్టిస్ అశోక్ భూషణ్ అధ్యక్షతన ఇద్దరు సభ్యులు బెంచ్ విచారణ జరిపి, తీర్పు రిజర్వు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇరు పక్షాలను అవసరమైన అదనపు పత్రాలను వచ్చే 48 గంటల్లో సమర్పించాలని ఆదేశించింది.
గోఫస్ట్ దివాళా పిటిషన్‌ను ఎస్ఎంబీసీ ఏవియేషన్ క్యాపిటల్ లిమిటెడ్, జీవై ఏవియేసన్, ఎస్‌ఎఫ్‌వీ ఎయిర్‌క్రాఫ్ట్ హోల్డింగ్స్ సవాల్ చేశాయి. గోఫస్ట్ యాజమాన్యానికి ఈ మూడు విమాన లీజు సంస్థలు దాదాపు 21 విమానాలను లీజుకిచ్చాయి. ఈ నెలలోనే పలు విమాన లీజు సంస్థలు.. గోఫస్ట్ యాజమాన్యం తీరుపై విమానయాన నియంత్రణ సంస్థ ‘డీజీసీఏ’కు ఫిర్యాదు చేశాయి. గోఫస్ట్ 45 విమానాల రిజిస్ట్రేషన్ తొలగించాలని అభ్యర్థించాయి. గోఫస్ట్ విమాన సర్వీసులు ఈ నెల మూడో తేదీ నుంచి నిలిచిపోయిన సంగతి తెలిసిందే.
ప్రాట్టి అండ్ విట్నీ సంస్థ తమకు ఇంజిన్ల సరఫరాలో జాప్యం వల్లే విమాన సర్వీసులు నడుపలేక నగదు కొరత సమస్యను ఎదుర్కొంటున్నట్లు గోఫస్ట్ తెలిపింది. అందుకే స్వచ్ఛంద దివాళా పిటిషన్ దాఖలు చేసినట్లు గోఫస్ట్ పేర్కొంది. దీంతో ఈ నెల 15 వరకు విమాన సర్వీసులు నిలిపేశారు. ముందస్తు టిక్కెట్ల విక్రయాలను ఆపివేశారు.