ముంబై, జనవరి 2: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాల్లో ముగిశాయి. ఈ క్రమంలోనే నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ ఆల్‌టైమ్ హైవద్ద స్థిరపడింది. 182 పాయింట్లు లేదా 0.70 శాతం ఎగిసి మునుపెన్నడూ లేనివిధంగా 26,328.55 వద్ద నిలిచింది. ఒకానొక దశలోనైతే 26,340ని తాకింది. దీంతో సరికొత్త ఇంట్రా -డే హై రికార్డు నమోదైంది. మరోవైపు బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 573.41 పాయింట్లు లేదా 0.67 శాతం ఎగబాకి 85,762.01 వద్ద ఆగింది. ఇంట్రా-డేలో 623.67 పాయింట్లు పుంజుకున్నది.
పవర్, బ్యాంకింగ్, మెటల్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడం కలిసొచ్చిందని మార్కెట్ నిపుణులు ట్రేడింగ్ సరళిని విశ్లేషిస్తున్నారు. డిసెంబర్లో వాహన విక్రయాలు ఆకర్షణీయంగా నమోదు కావడం కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను బలపర్చిందని అభిప్రాయపడుతున్నారు. కాగా, రంగాలవారీగా యుటిలిటీస్ (2.71 శాతం), విద్యుత్తు (2.26 శాతం), ఎనర్జీ (1.58 శాతం), ప్రభుత్వ బ్యాం కులు (1.53 శాతం), రియల్టీ (1.46 శాతం), మెటల్ (1.46 శాతం), ఆటో (1.04 శాతం) సూచీలు ఆకట్టుకున్నాయి.