హైదరాబాద్, నవంబర్ 14: రాష్ర్టానికి చెందిన ప్రముఖ ఔషధ సంస్థ నాట్కో ఫార్మా అంచనాలకు మించి రాణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ.369 కోట్ల నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.57 కోట్లతో పోలిస్తే 550 శాతం ఎగబాకింది. కంపెనీ విక్రయాలు రూ.452 కోట్ల నుంచి 134.7 శాతం ఎగిసి రూ.1,061 కోట్లకు చేరుకున్నాయి.
విదేశాల్లో ఫార్ములేషన్ ఉత్పత్తులకు డిమాండ్ ఉండటం, దేశీయ ఆగ్రోకెమికల్ వ్యాపారం అంచనాలకు మించి రాణించడం వల్లనే లాభాల్లో భారీ వృద్ధి నమోదైందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. కానీ మొదటి త్రైమాసికంలో నమోదైన లాభంతో పోలిస్తే 12 శాతం తగ్గగా, విక్రయాలు కూడా 8.5 శాతం పడిపోయాయి. అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను రూ.1.25 మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. ఇక ఔషధాలను ఇతర దేశాలకు ఎగుమతి చేయడం ద్వారా సంస్థకు రూ.792 కోట్ల ఆదాయం సమకూరగా, దేశీయ ఫార్ములేషన్ బిజినెస్‌తో రూ.102 కోట్లు లభించాయి.