NR Narayana Murthy | వారానికి 70 గంటలు పని చేయాలన్న వివాదాస్పద వ్యాఖ్యలను ఇన్ఫోసిస్ ఫౌండర్ ఎన్ఆర్ నారాయణ మూర్తి సమర్థించుకున్నారు. భారత్ వృద్ధి సాధించడానికి కష్టపడి చేయడం చాలా కీలకం అని పేర్కొన్నారు. ‘నన్ను క్షమించండి.. నేను నా ఆలోచనలు మార్చుకోలేను. నా ప్రాణం ఉన్నంత వరకూ ఇదే వైఖరి కలిగి ఉంటాను’ అని వ్యాఖ్యానించారు. సీఎన్బీసీ గ్లోబల్ లీడర్ షిప్ సమ్మిట్లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 1986లో భారత్ ఐటీ రంగం ఆరు పని దినాల వారం నుంచి ఐదు పని దినాల వారానికి మారినప్పుడు తాను నిరాశకు గురయ్యానని చెప్పారు. త్యాగాలతోనే భారత్ వృద్ధి సాధ్యమని, విశ్రాంతితో కాదన్నారు.
తాను వ్యక్తిగతంగా నైతిక ప్రమాణాలకు కట్టుబడి పని చేశానని ఎన్ఆర్ నారాయణమూర్తి పేర్కొన్నారు. ప్రతి రోజూ 14 గంటలు కష్ట పడే వాడినన్నారు. వారానికి ఆరున్నర రోజులు పని చేస్తూనే ఉండే వాడినని తెలిపారు. ఉదయం 6.30 గంటలకు ఆఫీసుకు వస్తే రాత్రి 8.40 గంటల వరకూ పని కొనసాగుతూనే ఉందని, అందుకు తాను గర్విస్తానని చెప్పారు. కష్టపడి పని చేయడమే దేశాభివృద్ధికి మార్గం అని, అందుకు ప్రత్యామ్నాయం లేదన్నారు. తెలివైన వారంతా కష్టపడి పని చేయాలన్నారు. గతంలో 70 పని గంటల వారం అమలు చేయాలన్నప్పుడు నారాయణ మూర్తి తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి.