
హైదరాబాద్, డిసెంబర్ 22: వ్యవసాయ, ఆహారోత్పత్తుల రిటైల్ కంపెనీ నామ్ధారి హైదరాబాద్‌లో కార్యకలాపాల్ని విస్తరించనున్నట్లు ప్రకటించింది. వచ్చే రెండేండ్లలో ఇక్కడ రూ.50 కోట్లు పెట్టుబడి చేస్తామని బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న నామ్ధారి గ్రూప్ సీఈవో గురుముఖ్ రూప్రా తెలిపారు. హైదరాబాద్ ప్రాంతంలో వ్యవసాయోత్పత్తుల సాగు కేంద్రాలు, డెయిరీ ఉత్పత్తుల కేంద్రాల ఏర్పాటుతో పాటు రిటైల్ స్టోర్స్, ఫుడ్ ఔట్లెట్స్, గోదాముల్ని నెలకొల్పుతామని చెప్పారు. నామ్ధారి సంస్థకు తెలంగాణలో ఇప్పటికే నామ్ధారి సీడ్స్ పేరుతో ఒక విత్తనాల కేంద్రం ఉన్నదని, ఇక్కడి క్విక్ సర్వీస్ రెస్టారెంట్లకు తమ ఆహారోత్పత్తుల్ని సరఫరా చేస్తున్నామని రూప్రా వివరించారు. భూమి, ఇతర వనరుల లభ్యతకు అనుగుణంగా హైదరాబాద్‌లో రక్షిత సాగు కేంద్రాల్ని ఏర్పాటు చేస్తామన్నారు. స్నాక్స్, పండ్లు, ఇతర ఫుడ్ ఐటెమ్స్‌ను అందించేందుకు తమ బ్రాండెడ్ రిటైల్ ‘సింప్లీ ఫుడ్ స్టోర్స్’నెలకొల్పుతామని, ఆర్గానిక్ పాలు, ఇతర డెయిరీ ఉత్పత్తులను నేరుగా సరఫరా చేసేందుకు చందాదారుల్ని చేర్చుకోవాలని భావిస్తున్నామని గ్రూప్ సీఈవో తెలిపారు.
ప్రస్తుతం తమ వార్షిక టర్నోవర్ రూ.800 కోట్లుగా ఉందని, వచ్చే 12-24 నెలల్లో దీనిని రూ.1,000 కోట్లకు పెంచాలన్నది లక్ష్యమన్నారు. ఇండోనేషియా, థాయ్‌లాండ్, మయన్మార్, టర్కీ, ఈజిప్ట్, మెక్సికో, ఆస్ట్రేలియా, మధ్యప్రాచ్య దేశాలకు నామ్ధారి ఎగుమతులు జరుగుతున్నాయి.