ముంబై, ఆగస్టు 12 : టాటా గ్రూపులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. టాటాసన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు బుధారం ప్రకటించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో తన చైర్మన్ పదవీ కాలం ముగియనుండటంతో పునర్నియామకంపై భిన్నాభిప్రాయాలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. 2017లో టాటా సన్స్ చైర్మన్‌గా నియమితులైన చంద్రశేఖరన్..రెండోసారి ఈ పదవిలో కొనసాగుతున్నారు. మూడోసారి పదవి కొనసాగింపుపై గత ఆరు నెలలుగా బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో చంద్ర ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ నెల 18న కంపెనీ వార్షిక సర్వ సభ్యసమావేశం జరుగడానికి ముందే వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. 2027 తర్వాత తన పునర్నియామకానికి బోర్డు సభ్యుల్లో ఒకరు మద్దతు ఇవ్వలేదని, దీంతో వైదొలగాలని నిర్ణయించినట్టు, ఏకగ్రీవ మద్దతు లేకపోవడంతో తాను ముందుకు సాగాలని అనుకోవడం లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం చైర్మన్ పదవి ఫిబ్రవరి 20, 2027న ముగియనున్నది. 63 ఏండ్ల వయస్సు కలిగిన చంద్రశేఖరన్..టాటా గ్రూపులోనే 40 ఏండ్లపాటు పనిచేయడం విశేషం.
గత ఫిబ్రవరిలో జరిగిన బోర్డు సమావేశంలో టాటా సన్స్ గ్రూపులో విభేదాలు బయటపొక్కాయి. టాటా సన్స్ చైర్మన్ పదవీకాలం పొడిగింపు విషయంలో టాటా ట్రస్ట్స్ చైర్మన్ నోయల్ టాటా అభ్యంతరం వ్యక్తంచేశారు. చంద్రశేఖరన్ నాయకత్వంలో గ్రూపులోని కొన్ని కంపెనీలు నష్టాల పాలయ్యాయని నోయల్ లేవనెత్తారు. పునర్నియామకంపై ఆయన కొన్ని షరతులు కూడా పెట్టినట్టు సమాచారం.
టాటాసన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ తన పదవికి రాజీనామా చేయడంతో గ్రూపు షేర్లు కుప్పకూలాయి. అత్యధికంగా టీసీఎస్ షేరు 3.71 శాతం నష్టపోగా, టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ 2.44 శాతం, టాటా ఎలక్సిస్ 2.23 శాతం, టాటా మోటర్స్ ప్యాసింజర్ వెహికల్ 1.92 శాతం, టాటా స్టీల్ 1.57 శాతం వరకు పతనం చెందాయి. వీటితోపాటు ర్యాలీస్ ఇండియా, ట్రెంట్, టాటా పవర్, ఇండియన్ హోటల్స్, టాటా కమ్యూనికేషన్స్, టైటాన్ షేర్లు కూడా కిందికు పడిపోయాయి. దీంతో ఈ సంస్థల మార్కెట్ విలువ రూ.45,615. 67 కోట్లు కరిగిపోయింది. వీటిలో టీసీఎస్ విలువే రూ.32,743. 69 కోట్లుగా ఉన్నది.
‘టాటా గ్రూపులో 40 ఏండ్లపాటు విధులు నిర్వహించాను. ఈ ప్రతిష్ఠాత్మక సంస్థకు సేవలందించినందుకు ఎంతో కృతజ్ఞతతో ఉన్నారు. దశాబ్దకాలంగా టాటాసన్స్కు నాయకత్వం వహించడం గొప్ప గౌరవంగాను, బాధ్యతగా భావించాను. టాటాసన్స్చాలా పెద్ద సంస్థ..ఎన్నో కీలక ప్రాజెక్టులు కీలక దశలో ఉన్నాయి. వచ్చే ఏడాదిలో గ్రూపును నడిపించడానికి ఒక నాయకుడు అవసరం. అదే సమయంలో ఉద్యోగులు, పెట్టుబడిదారులు, భాగస్వాములు, ఇతర వాటాదారులకు నాయకత్వంపై స్పష్టత ఇవ్వడం కూడా అంతే ముఖ్యం.
వదంతులు, సిద్ధాంతాలు, కుట్రపూరిత కథనాలపై పెద్దగా దృష్టి పెట్టకండని ఉద్యోగులకు చంద్రశేఖరన్ సూచించారు. బాంబే హౌస్‌లోని టౌన్ హాల్లో ఉద్యోగులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఏండ్ల తరపడి ఉద్యోగుల నుంచి లభించిన ప్రేమ, ఆప్యాయతలకు చల్లించిపోయిన చంద్రశేఖర్..టాటా గ్రూపుతో తన నాలుగు దశాబ్దాల ప్రయాణాన్ని ఒక్కసారిగా నెమరువేసుకున్నారు. మీకు ముందే తెలిసివుంటది అనుకుంటున్నా..వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నా పదవీకాలం ముగుస్తున్నందున నేను తిరిగి నియామకాన్ని కోరుకోవడం లేదని ఉద్యోగులతో అన్నారు. 40 ఏండ్ల క్రితం టాటా గ్రూపులో అడుగుపెట్టినప్పుడు తన కెరియర్ తనను ఎక్కడికి తీసుకువెళ్తుందో కలలో కూడా ఊహించలేదని, అయితే అందరికీ కెరియర్ చివరికి ముగిసిపోతాయని, మరొకరు బాధ్యతలు స్వీకరిస్తారని చెప్పారు. ‘టాటా అనేది ఎంతో గౌరవనీయమైన పేరు.. మీలాంటి ఉద్యోగుల కృషి వల్లే అది సాధ్యమైంది’ అని అన్నారు.
