మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లు తరచూ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ (ఏఎంసీ) అని వింటూ ఉంటారు. అయితే కొద్దిమందికే వాటి పాత్ర ఏంటి? అనేది తెలుసు. అసలు ఈ కంపెనీలు తమ దగ్గరకు వచ్చిన నిధులను ఏం చేస్తాయి? వాటిని సంపద సృష్టికి ఎలా నిర్వహిస్తాయో తెలుసుకుందాం.
అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అనేది సెబీ నియంత్రణలోని సంస్థ. మ్యూచువల్ ఫండ్ పోర్ట్‌ఫోలియో సేవల ద్వారా మదుపరుల నుంచి వచ్చే నగదును నిర్వహిస్తూ ఉంటుంది. దేశంలోని ప్రధాన ఏఎంసీలలో ఇప్పుడు ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్, హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్, నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ వంటివి ఉన్నాయి.
ఏఎంసీల ద్వారా ఏవైనా మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులకు వెళ్లే ముందు మదుపరులు ఆ ఫండ్ చరిత్ర, ట్రాక్ రికార్డ్, ఎక్స్పెన్స్ రేషియో, దీర్ఘకాల లక్ష్యాలు, ఇతర అంశాలను తప్పక పరిశీలించాలి. అలాగే యాంఫీలో ఏఎంసీ రిజిస్ట్రేషన్‌ను ధ్రువీకరించుకోవాలి. ఇందుకు యాంఫీ అధికారిక వెబ్సైట్ (www.amfi india.com) లేదా సెబీ మ్యూచువల్ ఫండ్ పోర్టల్‌ను సంప్రదించవచ్చు.