Elon Musk | ప్రపంచ కుబేరుడు – టెస్లా సీఈవో ఎలన్‌మస్క్‌కు సోషల్ మీడియా వేదిక ట్విట్టర్ సెగ గట్టిగానే తగులుతున్నది. ట్విట్టర్‌ను టేకోవర్ చేసిన తర్వాత ఆయన కష్టాలు పెరిగిపోయాయి. ట్విట్టర్ డీల్ కోసం అవసరమైన మనీ సేకరణకు టెస్లాలో తన షేర్లను ఎలన్‌మస్క్ విక్రయిస్తున్నారు. ఇన్వెస్టర్లు కూడా తెగనమ్మేస్తున్నారు. ఫలితంగా ఆయన నికర వ్యక్తిగత ఆదాయం 200 బిలియన్ డాలర్లు పడిపోయింది.
ట్విట్టర్‌ను ఎలన్‌మస్క్ టేకోవర్ చేసిన తర్వాత టెస్లా ఇన్వెస్టర్లు తమ షేర్లు విక్రయించేస్తున్నారు. దీంతో ఎలన్‌మస్క్ నికర సంపద పడిపోయింది. ట్విట్టర్‌ను కొనుగోలు చేయడంలో బిజీబిజీగా గడుపుతున్న ఎలన్‌మస్క్.. టెస్లా పురోగతిపై పెద్దగా శ్రద్ధ వహించడం లేదని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. ఏడాది కాలంలో టెస్లా షేర్ దాదాపు 52 శాతం పతనమైంది. గత ఆరు నెలల్లో 27.09 శాతం స్క్రిప్ట్ నష్టపోయింది.
ఫోర్బ్స్ ప్రకారం ప్రస్తుతం ఎలన్‌మస్క్ నికర సంపద 197.4 బిలియన్ డాలర్లు.. అంటే సుమారు రూ.16 లక్షలు ఉంటుంది. ఇందులో అత్యధికంగా టెస్లాలో సుమారు 15 శాతం ఆయనవే. ట్విట్టర్ డీల్ పూర్తయినప్పటి నుంచి 400 బిలియన్ల డాలర్ల విలువ గల టెస్లా షేర్లు విక్రయించారు. ఈ నెల 4-8 తేదీల మధ్య 19.5 మిలియన్ల షేర్లు విక్రయించానని మంగళవారం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో చెప్పారు. గత ఆగస్టులోనూ ట్విట్టర్ టేకోవర్‌కు అవసరమైన నిధుల కోసం 700 కోట్ల డాలర్ల విలువైన షేర్లను విక్రయించారు.
ఫోర్బ్స్ జాబితాలో ప్రపంచ కుబేరుల్లో ఎలన్‌మస్క్ మొదటి స్థానంలో.. గౌతం అదానీ మూడో స్థానంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఎలన్‌మస్క్ సంపద 194 బిలియన్ల డాలర్లు. రెండో స్థానంలో నున్న బెర్నార్డ్ అర్నాల్ట్ – ఆయన కుటుంబం 159.3 బిలియన్ల డాలర్లు (మన కరెన్సీలో రూ.12.9 లక్షల కోట్లు). గౌతం అదానీ 145.5 బిలియన్ల డాలర్ల వ్యక్తిగత సంపద కలిగి ఉన్నారు. నాలుగో స్థానంలో జెఫ్ బెజోస్, ప్రపంచంలోకెల్లా అగ్రశ్రేణి ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ ఐదో స్థానంలో కొనసాగుతున్నారు.