న్యూఢిల్లీ, డిసెంబర్ 17: ముందస్తు పన్ను వసూ ళ్ళు మళ్లీ ఊపందుకున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.4.60 లక్షల కోట్ల మేర అడ్వాన్స్ ట్యాక్స్ వసూలైనట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో వసూలైన దాంతో పోలిస్తే 53.50 శాతం అధికమని పేర్కొంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా రూ.10.80 లక్షల కోట్ల పన్నులు వసూలయ్యాయి. దీంట్లో రిఫండ్ రూపంలో రూ.1.35 లక్షల కోట్లు చెల్లింపులు జరుపడంతో మొత్తంగా రూ.9.45 లక్షల కోట్లు. గతేడాది ఇది రూ.5.88 లక్షల కోట్లుగా ఉన్నది. కరోనాతో కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి కోలుకోవడంతో పన్నుల వసూళ్ళు అమాంతం పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను మోదీ సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో అంచనావేసినదానికంటే అధికంగా వసూలవడం విశేషం.
కార్పొరేట్ ట్యాక్స్ వసూళ్ళు 70 శాతం పెరిగి రూ.5.15 లక్షల కోట్లకు చేరుకున్నాయి.
వ్యక్తిగత పన్ను వసూళ్ళు ఏడాది ప్రాతిపదికన 52 శాతం అధికమై రూ.4.10 లక్షల కోట్లకు చేరాయి.
గడిచిన ఆర్థిక సంవత్సరంలో 9.7 శాతం పెరిగి రూ.9.47 లక్షల కోట్ల మేర ప్రత్యక్ష పన్ను వసూలయ్యాయి.
హైదరాబాద్లో 55 వేల కోట్లు
మరోవైపు హైదరాబాద్ పన్నుల వసూళ్ళలో దూసుకుపోతున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇప్పటి వరకు భాగ్యనగరంలో రూ.55 వేల కోట్ల ముందస్తు పన్ను వసూలయ్యాయి. వసూళ్ళలో ఐదో స్థానంలో ఉండగా, వృద్ధి పరంగా చూస్తే నాలుగో శాతానికి ఎగబాకింది. మొదటి స్థానంలో దేశ ఆర్థిక రాజధాని ముంబై రూ.3.20 లక్షల కోట్లతో కొనసాగుతుండగా, ఆ తర్వాతి స్థానంలో ఢిల్లీ(రూ.1.19 లక్షల కోట్లు), బెంగళూరు(రూ.1.13 లక్షల కోట్లు) స్థానాల్లో ఉన్నాయి.