Multi-Asset Funds | భారతీయ మదుపరులకు స్థిరమైన పోర్ట్‌ఫోలియోనే ప్రాధాన్యతగా ఉంటుంది. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లలో ఒడిదుడుకులు ఉన్నప్పుడు, అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు ఏర్పడినప్పుడైతే దీనికే ఇన్వెస్టర్ల తొలి ఓటు. కానీ దీర్ఘకాలంలో చూసినైట్టెతే ఈక్విటీలు మదుపరులకు పెద్ద ఎత్తునే రాబడులను అందించాయని అర్థమవుతుంది. గడిచిన దశాబ్దకాలంలో నిఫ్టీ ఆకర్షణీయ ప్రదర్శననే కనబర్చింది మరి. అయినప్పటికీ అత్యంత సున్నితమైన స్టాక్ మార్కెట్ కదలికలు.. ఇన్వెస్టర్లను పెట్టుబడులపట్ల ఓ స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకోనివ్వలేకుండా చేస్తున్నాయి.
సూచీలు తీవ్ర ఆటుపోట్లకు లోనవుతున్న ప్రస్తుత సమయాల్లోనూ మదుపరులది ఇదే పరిస్థితి. ఇక సంప్రదాయ పెట్టుబడి సాధనాలుగా ఉన్న బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు (ఎఫ్డీలు) పరిమిత స్థాయిలోనే రాబడులను మదుపరులకు అందిస్తున్నా.. సురక్షిత పెట్టుబడిగా ఉండటంతో వీటికుండే డిమాండ్ వీటిది. కానీ పన్ను చెల్లింపుల అనంతరం ద్రవ్యోల్బణాన్ని అధిగమించే రాబడులను అందించడంలో ఇవి విఫలమనే చెప్పవచ్చు. ఇలా పెట్టుబడుల విషయంలో మదుపరులకు అన్నివిధాలుగా లాభసాటి వేదికలే పెద్దగా కనిపించడం లేదు. మరి ఏం చేయాలి?
పెట్టుబడులపట్ల స్పష్టతలేని మదుపరులకు ఓ చక్కని ప్రత్యామ్నాయంగా మల్టీ అసెట్ ఫండ్స్ నిలుస్తున్నాయి. ఈ ఫండ్స్.. ఈక్విటీలు, డెట్ మార్కెట్లు, రియల్ ఎస్టేట్, బంగారం లేదా ఇతర కమోడిటీల్లో పెట్టుబడుల్ని పెడుతాయి. తద్వారా పెట్టుబడుల్లో వైవిధ్యాన్ని కనబరుస్తాయి. ఓవైపు స్టాక్ మార్కెట్లలో.. మరోవైపు బాండ్లు, బంగారం వంటి వాటిపై ఇన్వెస్ట్ చేస్తూ హెచ్చుతగ్గులను సమన్వయం చేసుకుంటాయి.
ఈ క్రమంలోనే మదుపరులకు మార్కెట్లో ఎలాంటి పరిస్థితులున్నా రిస్క్‌ను అధిగమించే రాబడులను అందించగలుగుతాయి. నిజానికి మ్యూచువల్ ఫండ్స్‌ల్లో మల్టీ అసెట్ ఫండ్‌నూ ఓ రకమనే చెప్పవచ్చు. అందుకే వీటిని హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్‌గా పేర్కొంటారు. ఇక భారత్‌లో మల్టీ అసెట్ అల్లోకేషన్ ఫండ్స్.. ఈక్విటీ, డెట్, గోల్డ్ లేదా ఇతర కమోడిటీల్లో ఒక్కోదాంట్లో కనీసం 10 శాతమైనా పెట్టుబడుల్ని పెట్టాలని మార్కెట్ రెగ్యులేటర్ సెబీ నిబంధనలు చెప్తున్నాయి.
మల్టీ అసెట్ ఫండ్స్ సాధారణంగా గోల్డ్ ఈటీఎఫ్‌లు, గోల్డ్ ఫండ్ ఆఫ్ ఫండ్ల ద్వారా బంగారంలో పెట్టుబడుల్ని పెడుతాయి. అప్పుడప్పుడు సావరిన్ గోల్డ్ బాండ్ల (ఎస్జీబీ)లోనూ ఇన్వెస్ట్ చేస్తాయి. దీంతో మల్టీ అసెట్ ఫండ్స్‌ను ఎంచుకున్న ఇన్వెస్టర్లు.. భౌతిక బంగారాన్ని కొనడం, నిల్వ చేయడం వంటివి చేయకుండానే పరోక్షంగా గోల్డ్ రేట్లను ప్రభావితం చేయగలుగుతున్నారని చెప్పవచ్చు. అయితే ఈక్విటీలు, ఫిక్స్డ్ ఇన్కమ్ల్లోనే ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్న మల్టీ అసెట్ ఫండ్స్.. కేవలం 10-20 శాతం పెట్టుబడుల్నే గోల్డ్‌పై పెడుతున్నది. దీంతో ఇక్కడ గోల్డ్ మద్దతు పాత్రనే పోషిస్తున్నది. అయినప్పటికీ ఒడిదుడుకులను తట్టుకొని రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్స్‌ను పెంచుకోవడానికి ఇది దోహదం చేస్తున్నది.
కానీ ద్రవ్యోల్బణాన్ని అధిగమించేలా లేదా గోల్డ్ ర్యాలీని అందిపుచ్చుకోవాలన్నా ఈ మాత్రం పెట్టుబడులు చాలవు. అలాంటప్పుడు సావరిన్ గోల్డ్ బాండ్లు, గోల్డ్ ఈటీఎఫ్‌లు, డిజిటల్ గోల్డ్ వంటి సాధనాలను ఎంచుకోవడం ఉత్తమం. అప్పుడు మాత్రం మల్టీ అసెట్ ఫండ్స్‌ను కాకుండా నేరుగా గోల్డ్ ఇన్వెస్ట్మెంట్లకు దిగడమే తెలివైన పని. వాటికి ఎస్‌జీబీలు, గోల్డ్ ఈటీఎఫ్‌లు, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఉత్తమం. అయితే గోల్డ్ రేట్లు ఆల్‌టైమ్ హైలో ఉన్నందున ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం లాభదాయకమని మరువద్దు.