Mukesh Ambani | న్యూఢిల్లీ, జనవరి 7 : దేశీయ కుబేరుడు ముకేశ్ అంబానీ హవా కొనసాగుతున్నది. దేశీయ శ్రీమంతుల జాబితాలో ముకేశ్ అంబానీ తన తొలిస్థానాన్ని పదిలం చేసుకున్నారు. 2025కిగాను ఫోర్బ్స్ మాగ్యజైన్ విడుదల చేసిన జాబితాలో 95.4 బిలియన్ డాలర్ల వ్యక్తిగత సంపదతో తొలి స్థానంలో నిలిచారని పేర్కొంది. ఆ తర్వాతి స్థానంలో 62.3 బిలియన్ డాలర్లతో గౌతమ్ అదానీ నిలువగా, 42.1 బిలియన్ డాలర్ల సంపదతో శివ్ నాడర్ మూడో స్థానంలో నిలిచారు.
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది బిలియనీర్లు ఉన్న దేశాల్లో మూడో స్థానంలో ఉన్న భారత్లో ప్రతియేటా వీరి సంఖ్య పెరుగుతున్నట్లు విశ్లేషించింది. దేశ ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడుతుండటం ఇందుకు కారణమని తెలిపింది. ప్రస్తుతం భారత్లో 271 మంది బిలియనీర్లు ఉండగా, వీరిలో 84 మంది కొత్తగా చేరారు. తొలి పదిమంది జాబితాలో కేవలం ఒకేఒక్కరు మహిళ సావిత్రి జిందాల్ స్థానం దక్కించుకున్నారు.