ముంబై, అక్టోబర్ 9: చమురు నుంచి టెలికాం వరకు సేవలు అందిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ మళ్లీ దేశీయ శ్రీమంతుడిగా అవతరించారు. గతేడాది రెండో స్థానంతో సరిపెట్టుకున్న ఆయన..2025 సంవత్సరానికిగాను ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన జాబితాలో మళ్లీ తన తొలి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. 105 బిలియన్ డాలర్ల సంపదతో తొలి స్థానం దక్కించుకున్నారని తెలిపింది. గతేడాది తొలి స్థానంలో నిలిచిన అదానీ గ్రూపు చైర్మన్ గౌతమ్ అదానీ ఈ సారి రెండో స్థానానికి పడిపోయారు. 92 బిలియన్ డాలర్ల వ్యక్తిగత సంపదతో తన ర్యాంక్ దిగజారింది.
వీరితోపాటు టాప్-10 దేశీయ కుబేరుల జాబితాలో ఓపీ జిందాల్ గ్రూపు చైర్పర్సన్ సావిత్రి జిందాల్ మూడో స్థానాన్ని తిరిగి పొందారు. ఆమె వ్యక్తిగత సంపద 3.5 బిలియన్ డాలర్లు కరిగిపోయినప్పటికీ 40.2 బిలియన్ డాలర్లతో ఈ స్థానం దక్కించుకున్నారు. అలాగే రూపాయితో పోలిస్తే డాలర్ విలువ భారీగా పెరగడంతో టెలికాం దిగ్గజం సునీల్ మిట్టల్ తన స్థానాన్ని మూడు స్థానాలు ఎగబాకి నాలుగో స్థానానికి చేరుకున్నారు. ఆయన సంపద 3.5 బిలియన్ డాలర్లు ఎగబాకి 34.2 బిలియన్ డాలర్లకు చేరుకున్నది. గతేడాది నాలుగో స్థానంలో ఉన్న టెక్నాలజీ కుబేరుడు శివ్ నాడార్ ఈసారికిగాను ఐదో స్థానంతో సరిపెట్టుకున్నారు. దేశీయ 100 మంది కుబేరుల సంపద 9 శాతం లేదా 100 బిలియన్ డాలర్లు కరిగిపోయి ట్రిలియన్ డాలర్లకు పరిమితమైంది. గత నెల 19 వరకు షేర్లు, ఎక్సేంజ్ రేట్ల ఆధారంగా వీరి సంపదను లెక్కించింది.