న్యూఢిల్లీ, జూన్ 7: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ముంబైలోని తాను చదువుకున్న ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(ఐసీటీ)కి రూ.151 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించారు. 1970 దశకంలో ముకేశ్ అంబానీ ఐసీటీలో గ్రాడ్యుయేట్ చేశారు. ప్రొఫెసర్ ఎంఎం శర్మ బయోగ్రఫీ ‘డివైన్ సైంటిస్ట్’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ముకేశ్.. మూడు గంటలపాటు ఐసీటీలో గడిపి, ఈ భారీ విరాళాన్ని దేనికైనా వినియోగించుకోవచ్చునని పేర్కొన్నారు.
ప్రొఫెసర్ శర్మతో అనుబంధాన్ని ఈ సందర్భంగా ముకేశ్ పంచుకున్నారు. ఆ తర్వాతి కాలంలో ఆయన భారత ఆర్థిక వ్యవస్థలో సంస్కరణలకు ఎలా శ్రీకారం చుట్టారనే విషయాన్ని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. లైసెన్స్ పర్మిట్ రాజ్ నుంచి విముక్తి కలిగిస్తేనే దేశీయ పారిశ్రామిక రంగం పుంజుకుంటుందని శర్మ గతంలోనే చెప్పారని, ప్రపంచ దేశాలతో పోటీపడాలంటే ఈ కీలక నిర్ణయం తప్పక తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని ముకేశ్ గుర్తుచేశారు. ఈ విషయాన్ని అప్పటి ప్రభుత్వానికి వివరించడంలో విజయం సాధించారని..అందుకే ఆయనను గురు ఆఫ్ భారత్‌గా కొనియాడారు. ఆయనకు గురు దక్షిణగా ఐసీటీకి రూ.151 కోట్లు విరాళం ఇస్తున్నట్టు అంబానీ ఈ సందర్భంగా ప్రకటించారు.