Mukesh Ambani | రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ తన చిన్న కొడుకు అనంత్ అంబానీ కోసం దుబాయ్‌లో సముద్ర తీరాన బీచ్ వెంబడి అత్యంత ఖరీదైన విల్లా కొనుగోలు చేశారని సమాచారం. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) రాజధాని సిటీలో ఇప్పటి వరకు జరిగిన ఇండ్ల విక్రయాల్లో ఇదే అత్యంత గరిష్ఠం అని తెలుస్తున్నది. ఈ విల్లా ఖరీదు 80 మిలియన్ల డాలర్లు (సుమారు రూ.640 కోట్లు) ఉంటుందని అంచనా.
ఈ విల్లాలో 10 బెడ్రూమ్లు, ఒక ప్రైవేట్ స్పా సెంటర్, ఇండోర్-ఔట్‌డౌర్ పూల్ కూడా ఉన్నాయి. దుబాయిలోని పామ్ జుమేరియా ప్రాంతంలో ఇది కొలువుదీరి ఉంది. అత్యంత విలాసవంతమైన ఈ విల్లాలో జిమ్, ప్రైవేట్ థియేటర్ ఉన్నాయి. అంతే కాదు.. ఇది విలాసవంతమైన 7-స్టార్ హోటల్ కంటే ఏమీ తీసిపోదని నిపుణులు చెబుతున్నారు. విల్లా కోసం రూ.కోట్లు ఖర్చు చేసిన అంబానీ.. దాని భద్రత బలోపేతానికి భారీగా ఖర్చు చేస్తారు.
సంపన్నులకు ఫేవరెట్ మార్కెట్‌గా దుబాయ్ శరవేగంగా మారుతున్నది. ఇక్కడ ఇండ్లు కొనుగోలు చేసే విదేశీయుల కోసం యూఏఈ సర్కార్ దీర్ఘకాలిక `గోల్డెన్ వీసా`లు జారీ చేస్తున్నది. నిబంధనలు సడలిస్తున్నది. అనంత్ అంబానీ ఇంటికి ఇరుపక్కలా బ్రిటిష్ ఫుట్‌బాలర్ డేవిడ్ బెక్కం, బాలీవుడ్ మెగాస్టార్ షారూఖ్ ఖాన్ ఇరుగుపొరుగుగా అవతరించారు.