RIL AGM | రిలయన్స్ ఇండస్ట్రీస్ 48వ వార్షిక సర్వసభ్య సమావేశం (AGM) ప్రారంభమైంది. ఈ సందర్భంగా రిలయన్స్ గ్రూప్ చీఫ్ ముఖేష్ అంబానీ మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న జియో ఐపీవోపై కీలక ప్రకటన చేశారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని.. 2026 తొలి అర్ధభాగం వరకు ఐపీవో తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. భారతదేశ పురోగతి మార్గంలో కంపెనీ ముందుకు సాగుతోందన్నారు. భౌగోళిక రాజకీయ అనిశ్చితులు ఉన్నప్పటికీ భారత్ ముందుకెళ్తుందన్న ఆయన.. దాన్ని ఎవరూ ఆపలేరన్నారు. భారతదేశం ఇప్పటికే ప్రపంచంలోని అగ్ర నాలుగు ఆర్థిక వ్యవస్థలలో చేరిందని.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత దేశ జీడీపీ అన్ని ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. ప్రపంచ మోడల్‌ను భారతదేశం కాపీ చేయాల్సిన అవసరం లేదన్నారు.
ఇండియా ఫస్ట్ మోడల్‌ను సృష్టించగల సామర్థ్యం తమకు ఉందన్నారు. డీప్ టెక్నాలజీని ఉపయోగించి, మా మోడల్ భారతదేశ భద్రతను బలోపేతం చేస్తుందని.. ఇది ప్రజల జీవితాలను మెరుగుపరచడంతోపాటు పర్యావరణాన్ని కాపాడుతుందన్నారు. రిలయన్స్ తన స్వర్ణ దశాబ్దం ముగింపు దిశగా పయనిస్తుండగా.. భారతీయ కలను సాకారం చేసుకోవడానికి తాకు అంకితభావంతో ఉన్నామని ముఖేష్ అంబానీ పేర్కొన్నారు. తమ ప్రతి వ్యాపారాన్ని AI, డీప్-టెక్ సామర్థ్యాలతో బలోపేతం చేసుకుంటున్నామన్నారు. ‘వీ కేర్’ తత్వశాస్త్రంతో ప్రజల శ్రేయస్సు, పర్యావరణ శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇస్తున్నామని అంబానీ అన్నారు. కొత్త తరం నాయకత్వాన్ని శక్తివంతం చేయడానికి కంపెనీ కృషి చేస్తోందని, దీనికి కట్టుబడి ఉన్నామని ముఖేశ్ అంబానీ పేర్కొన్నారు. జియో ఇప్పుడు డీప్-టెక్ కంపెనీగా మారిందన్నారు.
జియో చైర్మన్ ఆకాశ్ అంబానీ మాట్లాడుతూ భారత్ ప్రపంచంలోనే మొట్టమొదటి AI నేటివ్ డిజిటల్ ఆర్థిక వ్యవస్థగా మార్చడానికి కంపెనీ పునాది వేస్తోందని అన్నారు. జియో నేడు 50 కోట్లకు పైగా కస్టమర్లకు సేవలందిస్తోందన్నారు. ప్రతి భారతీయుడి నమ్మకంతో ఈ విజయం సాధించామన్నారు. 5G నుంచి AI సేవల వరకు పూర్తిగా భారతదేశంలో అభివృద్ధి చేయబడిన సాంకేతికతతో కంపెనీ తన ముద్ర వేసిందన్నారు. జియో ఎయిర్‌ఫైబర్ నేడు ప్రపంచంలోనే అతిపెద్ద స్థిర వైర్లెస్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందిస్తుందని.. ఇది ప్రతి నెలా 10 లక్షలకుపైగా గృహాలకు తన సేవలను అందిస్తోందని తెలిపారు. జియో కంపెనీ సాంకేతిక మౌలిక సదుపాయాలను భారతదేశంలో పూర్తిగా రూపొందించి అభివృద్ధి చేశామని, జియో దేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తును రూపొందిస్తోందని ఆకాశ్ అంబానీ అన్నారు.