Muhurat Trading | ఒక ఏడాది దీపావళి నుంచి మరొక ఏడాది దీపావళి వరకు సంవత్ సంవత్సరంగా పరిగణిస్తారు. 2078 సంవత్ శనివారంతో ముగిసింది. ఆదివారం నుంచి 2079 సంవత్ సంవత్సరం ప్రారంభం కానున్నది. గతేడాది కాలంలో వచ్చిన లాభాలను సమీక్షించుకుని వచ్చే దీపావళి నాటికి అనుసరించాల్సిన వ్యూహాలు, ఏఏ కంపెనీలో పెట్టుబడులు పెట్టాలో ఇన్వెస్టర్లు నిర్ణయించుకుంటారు. దీపావళి నాడు స్టాక్ ఎక్స్చేంజ్ల్లో నిర్వహించే ముహరత్ ట్రేడింగ్‌తో నూతన ప్రణాళికలకు శ్రీకారం చుడతారు. అసలు స్టాక్ మార్కెట్లలో ముహరత్ ట్రేడింగ్ తీరు తెన్నులు, దాని ఆనవాయితీ కథా కమామిషు తెలుసుకుందాం..
దీపావళి రోజు పని ప్రారంభిస్తే విజయం సాధిస్తామని భారతీయులు నమ్ముతారు. అలాగే స్టాక్ మార్కెట్లలో ముహరత్ ట్రేడింగ్‌లో పాల్గొంటే వచ్చే ఏడాది దీపావళి వరకు లాభాలు పండుతాయని ఇన్వెస్టర్లు నమ్ముతుంటారు. అందుకోసమే స్టాక్ ఎక్స్చేంజీలు ప్రతియేటా దీపావళి నాడు ముహరత్ ట్రేడింగ్ నిర్వహిస్తారు. ఈ ట్రేడింగ్ గంట సేపు సాగుతుంది. దీన్ని కూడా స్టాక్ ఎక్స్చేంజ్లే నిర్ణయిస్తాయి. ఈ గంట లోపే ఒక స్టాక్ అయినా కొనుగోలు చేయాలని ట్రేడర్లు సెంటిమెంట్‌గా పెట్టుకున్నారు. ధంతేరాస్ (ధన త్రయోదశి) నాడు వీసమెత్తు బంగారం కొనుగోలు చేయాలని భారతీయ వనితలు భావిస్తారో, ముహరత్ ట్రేడింగ్‌ను కూడా ఇన్వెస్టరలు అలాగే పరిగణిస్తారు. దీపావళి సందర్భంగా స్టాక్ మార్కెట్లు, స్టాక్ మార్కెట్ బ్రోకర్ సంస్థల ఆఫీసులన్నీ విద్యుత్, సాధారణ దీపాల కాంతుల్లో వెలుగులీనుతుంటాయి.
ఒక గంట సేపు సాగే ఈ ట్రేడింగ్‌లో రెండు పార్టీల మధ్య స్టాక్ క్రయ, విక్రయాలకు అంగీకారం కుదిరితే బ్లాక్ డీల్ సెషన్ అంటారు. స్టాక్ ఎక్స్చేంజ్లు ఈక్విలిబ్రియంను నిర్ణయిస్తాయి. ఈ సెషన్ దాదాపు ఎనిమిది నిమిషాలు సాగుతుంది. నార్మల్ మార్కెట్ సెషన్ సమయంలో అసలు ట్రేడింగ్ జరుగుతుంది. తేలికగా అమ్ముడు కానీ (ఇల్లిక్విడ్) సెక్యూరిటీల ట్రేడింగ్ జరుగుతుంది. చివరిగా ముగింపు ధర వద్ద ఇన్వెస్టర్లు మార్కెట్ ఆర్డర్ పెడతారు. సాయంత్రం 5.45 గంటల నుంచి 6.00 గంటల వరకు బ్లాక్ డీల్ సెషన్, 6.00-6.08 గంటల మధ్య ప్రీ ఓపెన్ మార్కెట్, 6.15-7.15 మధ్య నార్మల్ ట్రేడింగ్, 6.20-7.05 గంటల మధ్య కాల్ యాక్షన్ సెషన్, రాత్రి 7.25-7.35 గంటలకు క్లోజింగ్ సెషన్ ఉంటుంది.