GST Effect on Onling Gaming | ఆన్లైన్ గేమింగ్‌పై కేంద్ర ప్రభుత్వం విధించిన 28 శాతం జీఎస్టీ.. ఆ రంగంలో పని చేస్తున్న ఉద్యోగులకు శరాఘాతంలా మారింది. దేశంలోనే పాపులర్ ఆన్ లైన్ గేమింగ్ అండ్ ఫాంటసీ స్పోర్ట్స్ స్టార్టప్ ‘మొబైల్ ప్రీమియర్ లీగ్ (ఎంపీఎల్)’ యాజమాన్యం పొదుపు చర్యలు ప్రారంభించింది. తమ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగుల్లో దాదాపు సగం మందిని ఇంటికి సాగనంపాలని నిర్ణయించినట్లు సమాచారం. అంటే 350 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలుకనున్నట్లు వార్తలొచ్చాయి. ఆన్ లైన్ రియల్-మనీ గేమ్స్ మీద 28 శాతం జీఎస్టీ వసూలు చేయాలని కొన్ని వారాల క్రితం కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో బెంగళూరు కేంద్రంగా పని చేస్తున్న స్టార్టప్ సంస్థ ‘ఎంపీఎల్’ గతవారమే ఉద్యోగులకు లే-ఆఫ్స్ ప్రకటిస్తున్నట్లు తెలిపింది. ఉద్వాసనకు గురైన ఉద్యోగులకు వ్యక్తిగతంగా మంగళవారం మెసేజ్ పంపినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. తొలుత దీనిపై స్పందించేందుకు ఎంపీఎల్ నిరాకరించింది. ఒక ఆంగ్ల దిన పత్రికలో వార్త ప్రచురణతో ఎంపీఎల్లో లేఆఫ్స్ ఖరారయ్యాయని తెలుస్తున్నది.
ఎంపీఎల్ సంస్థ ఉద్యోగులకు ఉద్వాసన పలుకడం ఇది రెండోసారి. గతేడాది మే నెలలో ఇండోనేషియాలో 100 మంది ఉద్యోగులను ఎంపీఎల్ ఇంటికి సాగనంపింది. నూతన పన్ను విధానం వల్ల తమపై 350-400 శాతం పన్ను భారం పెరుగుతుందని ఎంపీఎల్ ఫౌండర్, సీఈఓ సాయి శ్రీనివాసన్ తెలిపారు.