ముంబై, జూన్ 6: గత ఏడాది మే నెల నుంచి అదేపనిగా వడ్డీ రేట్లను పెంచుతూపోయిన రిజర్వ్‌బ్యాంక్ 2023 ఏప్రిల్ నెల పాలసీ సమీక్షలో ఎట్టకేలకు పెంపునకు బ్రేక్ వేసింది. ఈ దఫా కూడా కీలక వడ్డీ రేట్లలో మార్పు ఉండకపోవచ్చని అంచనాల నడుమ ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) జూన్ నెల ద్రవ్య విధాన సమీక్షా చర్చల్ని మంగళవారం ప్రారంభించింది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలో ఆరుగురు సభ్యులు గల ఎంపీసీ.. మూడు రోజులపాటు జరిపే సమావేశం నిర్ణయాల్ని జూన్ 8 గురువారంనాడు వెల్లడించనుంది. ప్రస్తుతం ఆర్బీఐ రెపో రేటు 6.5 శాతంగా ఉంది. 2022 మే నెల నుంచి 250 బేసిస్ పాయింట్ల (2.5 శాతం) మేర రెపో రేటును పెంచింది. ఇందుకు అనుగుణంగా బ్యాంక్‌లు వరుసపెట్టి రుణాలపై రేట్లను పెంచడం, ఈఎంఐలు భారమై వినియోగదారులు సతమతమవుతున్న సంగతి తెలిసిందే.
అయితే ఇటీవల రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో వృద్ధికి ఊతమిచ్చేందుకు ఈ సారీ రేట్లను పెంచదని అంచనా వేస్తున్నట్టు డెలాయిట్ ఇండియా ఎకానమిస్ట్ రుక్మి మజుందార్ చెప్పారు. ఏప్రిల్‌లో వినిమయ ద్రవ్యోల్బణం 18 నెలల కనిష్ఠస్థాయి 4.7 శాతానికి తగ్గింది. కానీ అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మందగిస్తున్న ప్రభావం భారత్‌పై పడుతుందని, ఈ కారణంగా రేట్ల పెంపునకు బ్రేక్ వేస్తుందన్నారు. ఇదే అభిప్రాయాన్ని హౌసింగ్.కామ్ గ్రూప్ సీఈవో ధృవ్ అగర్వాల్ వ్యక్తం చేస్తూ వృద్ధి కోసం రేట్లు తగ్గించాలన్న గొంతులు కూడా విన్పిస్తున్నాయని వివరించారు. పాలసీ రేట్లను తగ్గించాలని, దీంతో వినియోగదారుల సెంటిమెంట్ మెరుగుపడుతుందని, రియల్ రంగానికి ఊతమిస్తుందని సిగ్నేచర్ చైర్మన్ ప్రదీప్ అగర్వాల్ తెలిపారు.