Third Party Insurance | దేశంలో వాహనదారులకు మోటార్ బీమాప్పనిసరి. మీకు కారున్నా.. బైకున్నా.. లేదా మరే వాహనం ఉన్నా.. వెహికిల్ ఇన్సూరెన్స్ నుంచి మాత్రం తప్పించుకోలేరు. ఇది మోటార్ వెహికిల్స్ యాక్ట్ 1988 నిబంధన. కాబట్టి ప్రతీ వాహనదారునికి మోటార్ ఇన్సూరెన్స్‌పై అవగాహన ఉండాల్సిందే. అయితే చాలామంది మొక్కుబడిగా ఏదో ఓ ఇన్సూరెన్స్‌ను తీసుకుని సరిపెట్టుకుంటున్నారు. ట్రాఫిక్ చలాన్ల నుంచి బయటపడితే చాలన్నట్టు వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్‌ను తీసుకునేందుకు పెద్దగా ఎవరూ ఆసక్తి కనబర్చడం లేదు. ఈ రకమైన వైఖరి చాలాచాలా నష్టపరుస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సమగ్ర పాలసీ అవసరం
కార్ ఇన్సూరెన్సైనా, బైక్ ఇన్సూరెన్సైనా సమగ్ర రీతిలో ఉండాలి. మీరు తీసుకున్న వెహికిల్ ఇన్సూరెన్స్ మీ వాహనానికి ఓ భద్రతా వలయంలా రక్షణనివ్వాలి. కేవలం థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్‌పైనే దృష్టి పెట్టకూడదు. ఉదాహరణకు ఒకవేళ మీ ఇంటి బయట పార్క్ చేసిన కారుపై దగ్గర్లోని ఓ చెట్టు కొమ్మ విరిగిపడింది. దీనివల్ల కారుకు బాగానే నష్టం వాటిల్లింది. లేదా ఉదయం లేచిచూసేసరికి మీ అపార్ట్మెంట్ అవతలనున్న మీ బైక్‌ను దొంగిలించారు. ఇలాంటి సందర్భాల్లో మీరు తీసుకునే బీమానే మీకు రక్ష. అలాగే వరదలు, భూకంపాల వంటి ప్రకృతి విపత్తులు, అల్లర్ల వంటి వాటిలో నష్టం జరిగినా వాహన బీమా వర్తిస్తుందన్నది మరువద్దు. కాబట్టి అన్ని కోణాల్లో ఆలోచించి, ఆరా తీసి ఓ సమగ్ర పాలసీని తీసుకోవాలి.
థర్డ్-పార్టీ బీమా అంటే?
కార్ ఇన్సూరెన్స్, బైక్ ఇన్సూరెన్స్‌ల్లో థర్డ్-పార్టీ బీమా చాలా ముఖ్యమైనది. మోటార్ ఇన్సూరెన్స్‌లో ఫస్ట్-పార్టీ వాహన యాజమాని (ఇన్సూరెన్స్‌ను కొన్నవారు). సెకండ్-పార్టీ ఇన్సూరెన్స్‌ను అమ్మినవారు (బీమా సంస్థ). థర్డ్-పార్టీ ఏదైనా ప్రమాదంలో మీ వాహనం వల్ల నష్టపోయినవారు, గాయాలపాలైనవారు, చనిపోయినవారు. చికిత్సకు వైద్య ఖర్చులు, ఆస్తి నష్టానికి నగదును ఈ కవరేజీలో బీమా సంస్థనే అందిస్తుంది. థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ లేకపోతే ఈ ఖర్చులన్నీ వాహనదారుడి నెత్తిపైనే పడుతాయి. కనుక తప్పకుండా అత్యుత్తమ బీమాను తీసుకోవాలి. గడువు దాటకముందే రెన్యువల్స్ చేస్తూపోవాలి. అయితే ప్రమాదంలో మీకు (ఇన్సూరెన్స్‌ను కొన్నవారు), మీ వాహనానికి జరిగిన నష్టం మాత్రం థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ పరిధిలోకి రాదు.
ఇది గుర్తుంచుకోండి..
సరైన వాహన బీమా పాలసీని తీసుకోవడం వల్ల మీ కారు, బైక్‌లకే కాదు.. మీకూ అనేక లాభాలుంటాయి. కాబట్టి మార్కెట్లో అందుబాటులో ఉన్న వివిధ రకాల మోటార్ ఇన్సూరెన్స్‌లను క్షుణ్ణంగా పరిశీలించి ఓ నిర్ణయానికి రావాలి. ఈ క్రమంలో క్యాష్‌లెస్ గ్యారేజ్ నెట్వర్క్స్, ప్రీమియం ధరలు, యాడ్-ఆన్ ఫీచర్లు, బీమా సంస్థకున్న విశ్వసనీయత, కవరేజీ వంటి వాటిని ప్రధానంగా పరిగణనలోకి తీసుకోవాలి. కాగా, మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ బ్రేక్‌డౌన్ జరగడం, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండానే వాహనం నడిపి ప్రమాదాలకు గురికావడం, మద్యం సేవించి వాహనాలు నడుపడం వంటి నిబంధనల ఉల్లంఘనల్లో కవరేజీలు వర్తించవు.