ITR | గత ఆర్థిక సంవత్సరానికి (2024-25 అంచనా సంవత్సరం) ఐదు కోట్లకు పైగా ఐటీ రిటర్న్స్ దాఖలయ్యాయని ఆదాయం పన్ను విభాగం తెలిపింది. 2023-24 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఎనిమిది శాతం ఎక్కువ ఐటీ రిటర్న్స్ దాఖలయ్యాయని పేర్కొంది. ఐటీఆర్ దాఖలు చేయడానికి గడువు దగ్గర పడుతుండటంతో ఈ-ఫైలింగ్ పోర్టల్లో అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని ఇన్ఫోసిస్ సంస్థను కోరినట్లు పేర్కొంది. ఈ నెల 26 నాటికి 2024-25 అంచనా సంవత్సరానికి ఐదు కోట్లకు పైగా ఐటీఆర్ లు దాఖలయ్యాయని వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే ఎనిమిది శాతం ఐటీఆర్ లు ఎక్కువ ఫైల్ అయ్యాయని ఎక్స్ (మాజీ ట్విట్టర్) ఖాతాలో పోస్టు చేసింది. ఈ-ఫైలింగ్ పోర్టల్ నిర్వహణకు ఇన్ఫోసిస్ సాంకేతిక భాగస్వామి అని ఆదాయం పన్ను విభాగం వివరించింది. 2023-24లో 8.61 కోట్లకు పైగా ఐటీఆర్ లు ఫైల్ అయ్యాయి.