Moodys on GDP | 9.1 శాతానికి తగ్గించిన మూడీస్
న్యూఢిల్లీ, మార్చి 17: ప్రస్తుత సంవత్సరానికి భారత్ వృద్ధి రేటును 9.1 శాతానికి తగ్గిస్తున్నట్టు అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ప్రకటించింది. అధిక ఇంధన, ఎరువుల దిగుమతి బిల్లు కారణంగా ప్రభుత్వ మూలధన వ్యయం పరిమితంగా ఉంటుందన్న కారణంతో తాము గతంలో వేసిన 9.5 శాతం వృద్ధి అంచనాలో కోత విధిస్తున్నట్టు రేటింగ్ ఏజెన్సీ గురువారం పేర్కొంది. ముడి చమురును అధికంగా దిగుమతి చేసుకునే దేశమైనందున అధిక క్రూడ్ ధరలు భారత్ వృద్ధిని తగ్గిస్తాయని, అయితే అంతర్జాతీయంగా నెలకొన్న అధిక ఆహారోత్పత్తుల ధరల ప్రభావం భారత్‌పై పడదని, మిగులు ఆహారధాన్యాలు కలిగిన దేశంకావడం, వ్యవసాయోత్పత్తుల ఎగుమతులు ఇందుకు కారణమని మూడీస్ వివరించింది.
ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని, 2022 సంవత్సరానికి వృద్ధి రేటును 0.4 శాతం మేర తగ్గిస్తున్నామని, 2023 సంవత్సరంలో వృద్ధి రేటు 5.4 శాతంగా అంచనా వేస్తున్నట్టు వెల్లడించింది. 2022 సంవత్సరాంతానికి ద్రవ్యోల్బణం 6.6 శాతంగా ఉంటుందని తెలిపింది. కాగా 2021 క్యాలండర్ సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 8.2 శాతం వృద్ధిచెందగా, 2020లో కొవిడ్ సంక్షోభంతో జీడీపీ 6.7 శాతం క్షీణించింది.
ఉక్రెయిన్‌పై రష్యా సైనిక దాడితో ప్రపంచ ఆర్థికాభివృద్ధి సైతం మందగిస్తుందని, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ఫలితంగా కమోడిటీల ధరలు పెరుగుతాయని, ఫైనాన్షియల్, బిజినెస్ వాతావరణం దెబ్బతింటుందని మూడీస్ వివరించింది. కొత్త కొవిడ్ వేవ్స్, కేంద్ర బ్యాంక్‌ల ద్రవ్య విధాన పొరపాట్లు, అధిక ద్రవ్యోల్బణం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు రిస్క్‌లని తెలిపింది.
ఇక చైనా ఆర్థిక వ్యవస్థ 2022లో 5.2 శాతం, 2023లో 5.1 శాతం వృద్ధిచెందవచ్చని అంచనా వేసింది. జీ-20 దేశాల్లో రష్యా ఆర్థిక వ్యవస్థ 7%, 2023లో 3% చొప్పున క్షీణిస్తుందని అంచనా వేసింది. ఉక్రెయిన్‌పై దాడికి ముందు ఈ దేశ జీడీపీ 2%, వచ్చే ఏడాది 1.5% చొప్పున వృద్ధిచెందవచ్చని గతంలో మూడీస్ అంచనాల్లో పేర్కొంది.