జీడీపీకి మూడీస్ కోత
- 8.8 శాతం నుంచి 7.7 శాతానికి తగ్గింపు
- వడ్డీ రేట్ల పెరుగుదల, ప్రపంచ వృద్ధి మాంద్యం కారణాలు
- జూన్ త్రైమాసిక వృద్ధి
- అంచనాలకంటే తక్కువన్న అంతర్జాతీయ సంస్థలు
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్.. భారత్ ఆర్థికాభివృద్ధి అంచనాల్ని భారీగా తగ్గించింది. 2022లో భారత్ జీడీపీ వృద్ధి 7.7 శాతానికి పరిమితమవుతుందంటూ గురువారం తాజా అంచనాల్ని వెల్లడించింది. ఈ ఏడాది మే నెలలో ప్రకటించిన 8.8 శాతం వృద్ధి అంచనాల్ని 1.1 శాతం మేర కుదించింది. వడ్డీ రేట్ల పెరుగుదల, అంతర్జాతీయ వృద్ధి మందగించడం, దేశమంతటా రుతుపవనాల సమంగా విస్తరించకపోవడం వంటి అంశాల కారణంగా వచ్చే త్రైమాసికాల్లో ఆర్థిక వ్యవస్థ వృద్ధివేగం తగ్గుతుందని మూడీస్ వివరించింది. 2021లో 8.3 శాతంగా ఉన్న జీడీపీ వృద్ధి రేటు ఈ ఏడాది 7.7 శాతానికి, 2023లో 5.2 శాతానికి తగ్గుతుందని అంచనా వేసింది. జూన్ త్రైమాసికానికి జీడీపీ గణాంకాల్ని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మరుసటి రోజే మూడీస్ తాజా అంచనాలు వెలువడ్డాయి. బుధవారం వెలువడిన అధికారిక గణాంకాల ప్రకారం ఈ ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో జీడీపీ 13.5 శాతం వృద్ధిచెందింది.
రూపాయి క్షీణత.. ద్రవ్యోల్బణానికి రిస్క్
భారత్‌కు ద్రవ్యోల్బణం ఒక పెద్ద సవాలుగా పరిణమిస్తుందని, రూపాయి క్షీణించడంతో దిగుమతయ్యే ఉత్పత్తుల ధరలు పెరిగి ద్రవ్యోల్బణాన్ని ఎగదోస్తాయని మూడీస్ హెచ్చరించింది. ఈ ఏడాది ఇప్పటివరకూ అమెరికా డాలర్ మారకంలో రూపాయి విలువ 7 శాతం క్షీణించిందన్నది. వృద్ధిని, ద్రవ్యోల్బణాన్ని సమన్వయపర్చుకుని పాలసీని రూపొందించడం రిజర్వ్‌బ్యాంక్‌కు సవాలుగా మారుతుందన్నది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై-డిసెంబర్ ద్వితీయార్థంలో ద్రవ్యోల్బణ ఒత్తిడిలు తగ్గవచ్చని, అంతర్జాతీయంగా కమోడిటీ ధరలు వేగంగా తగ్గితే ఆర్థికాభివృద్ధి పుంజుకోవచ్చన్న ఆశాభావాన్ని మూడీస్ వ్యక్తం చేసింది. జూలై నెలలో ద్రవ్యోల్బణం 6.7 శాతానికి తగ్గినప్పటికీ, ఆర్బీఐ నిర్దేశిత లక్ష్యం 6 శాతంపైగానే వరుసగా ఏడో నెలలో సైతం నమోదయ్యింది. ద్రవ్యోల్బణం ఒత్తిడుల్ని అణచివేసేందుకు 2023లో కూడా కఠినంగా వ్యవహరించవచ్చని మూడీస్ అంచనా వేసింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ రిస్క్ల్ని ఎదుర్కొంటుందని, ఇంధన ధరల పరుగులు తీసే ప్రమాదం ఇంకా పొంచిఉందని తెలిపింది.
మోర్గాన్‌స్టాన్లీ కూడా..
మరో అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ మోర్గాన్ స్టాన్లీ సైతం భారత్ జీడీపీపై ప్రతికూలంగా స్పందించింది. ఏప్రిల్-జూన్ వృద్ధి అంచనాలకంటే తక్కువగా ఉన్నందున, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు అంచనాల్ని 40 బేసిస్ పాయింట్ల మేర తగ్గిస్తున్నట్లు మోర్గాన్‌స్టాన్లీ ఇండియా ఎకానమిస్ట్ ఉపాసన చాచ్రా తెలిపారు. ఈ నేపథ్యంలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి తాము గతంలో వెల్లడించిన వృద్ధి రేటు అంచనా 7.2 శాతం నుంచి 40 బేసిస్ పాయింట్లు (0.4 శాతం) తగ్గిస్తున్నట్లు ఉపాసన ప్రకటించారు.
వృద్ధి 6.8 శాతమే: ఎస్బీఐ
ఇతర అంతర్జాతీయ దిగ్గజాల బాటలోనే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నడిచింది. జాతీయ గణాంకాల శాఖ (ఎన్ఎస్వో) బుధవారం విడుదల చేసిన క్యూ1 డాటా తమ అంచనాలకంటే బాగా తక్కువగా ఉందంటూ స్వయానా ప్రభుత్వ రంగ బ్యాంకైన ఎస్బీఐ విరుచుకుపడింది. దీంతో 2022-23 ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు అంచనాల్ని భారీగా 70 బేసిస్ పాయింట్ల మేర 7.5 శాతం నుంచి 6.8 శాతానికి తగ్గించింది. వాస్తవానికి రిజర్వ్ బ్యాంక్ జూన్ త్రైమాసికంలో వృద్ధి 16.7 శాతం ఉంటుందన్న అంచనాల్ని గతంలో ప్రకటించగా, వివిధ సంస్థలు ఇది 15-16.7 శాతం మధ్య ఉండవచ్చని అంచనా వేశాయి. తాము కూడా తొలి త్రైమాసికంలో వృద్ధి 15.7 శాతం నమోదవుతుందని భావించామని ఎస్బీఐ గ్రూప్ చీఫ్ ఎకానమిక్ అడ్వయిజర్ సౌమ్య కాంతి ఘోష్ గురువారం విడుదల చేసిన ఒక నోట్లో తెలిపారు. ఎన్ఎస్వో డాటా ప్రకారం ఆర్థిక వ్యవస్థ క్యూ1లో 13.5 శాతం వృద్ధి చెందింది కనుక, వాస్తవ జీడీపీ వృద్ధి మార్చి క్వార్టర్ కంటే 9.6 శాతం తగ్గినట్లని ఘోష్ వివరించారు.
ఇదేబాటలో గోల్డ్‌మాన్ శాక్స్
మూడీస్ బాటలోనే అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ గోల్డ్‌మాన్ శాక్స్ కూడా భారత్ జీడీపీ వృద్ధి అంచనాల్ని కుదించింది. 2022 పూర్తి క్యాలండర్ సంవత్సరానికి జీడీపీ వృద్ధి రేటు 7 శాతానికి పరిమితమవుతుందని ప్రకటించింది. ఈ సంస్థ గతంలో దీనిని 7.6 శాతంగా అంచనా వేసింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి కూడా 20 బేసిస్ పాయింట్లు కోతపెట్టి, భారత్ జీడీపీ 7.2 శాతం మాత్రమే వృద్ధి చెందుతుందని పేర్కొంది. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి వెల్లడైన అధికారిక జీడీపీ డాటా తమ అంచనాలకంటే తక్కువగా ఉందని గోల్డ్‌మాన్ శాక్స్‌లో ఇండియా ఎకానమిస్ట్ శంతను సేన్‌గుప్తా చెప్పారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

