న్యూఢిల్లీ/ముంబై, మే 15 : పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన ప్రభుత్వ రంగ టెలికం సంస్థలు భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్), మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ (ఎంటీఎన్ఎల్) స్థిరీకరణకు.. వాటి భూములను అమ్మే దిశగా కేంద్ర ప్రభుత్వం వెళ్తున్నది. ఇందులో భాగంగానే ఈ ఆర్థిక సంవత్సరం (2025-26) దాదాపు రూ.1,000 కోట్ల విలువైన భూములను విక్రయించాలని చూస్తున్నట్టు సంబంధిత అధికారి ఒకరు చెప్తున్నారు. తద్వారా ఆయా సంస్థల రుణ భారాన్ని తగ్గించవచ్చని, వాటి ద్రవ్యలభ్యతను కూడా పెంచవచ్చని అంటున్నారు. ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ప్రభుత్వ రంగ సంస్థల శాఖ (డీపీఈ) భూములను గుర్తించగా.. వీటిని వీలైతే అమ్మడమో లేదా లీజుకు ఇవ్వడమో చేసే ఆలోచనలో మోదీ సర్కారు ఉన్నది. కాగా, బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్కు దేశంలోని ప్రధాన నగరాల్లో భూములుండగా.. 2-3 చోట్ల భూములను అమ్మకానికి తీసుకురాబోతున్నారు. ఈ ఏడాదిలోనే వీటిని అమ్మవచ్చని, రూ.1,000 కోట్లు రావచ్చని అంచనా.
ప్రభుత్వ సంస్థలే అయినప్పటికీ మార్కెట్లో ప్రైవేట్ రంగ కంపెనీలతో పోటీపడలేక బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ చతికిలపడ్డాయి. అయితే ఇందుకు కారణం కేంద్ర ప్రభుత్వ పెద్దలేనన్న విమర్శలు ఆయా సంస్థల ఉద్యోగ సంఘాలు, ఆర్థిక విశ్లేషకుల నుంచి గట్టిగా వినిపిస్తున్నాయి. ప్రధానంగా స్పెక్ట్రం కేటాయింపుల్లో ప్రాధాన్యత ఇవ్వకపోవడం చాలాచాలా నష్టపర్చిందన్న వాదనలున్నాయి. దీంతో ఏండ్ల తరబడి నెట్వర్క్ను విస్తరించలేక, సిగ్నలింగ్ లోపాలతో సబ్స్ర్కైబర్లు దూరమైపోతున్నారు. మరోవైపు ఆదాయం లేక, నిర్వహణ భారమై అప్పుల ఊబిలో కూరుకుపోయాయని చెప్తున్నారు. రుణ చెల్లింపుల్లో ఎంటీఎన్ఎల్ విఫలమవుతుండటంతో రుణదాతల (బ్యాంకర్లు)తో క్యాబినెట్ సెక్రటరీ టీవీ సోమనాథన్ శుక్రవారం సమావేశమవుతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది.