న్యూఢిల్లీ, అక్టోబర్ 15 : భారతీయ బ్యాంకింగ్ రంగంలో మరో విడుత ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనాలకు సమయం ఆసన్నమైందా? ఇప్పటికే భారీ సంఖ్యలో పడిపోయిన సర్కారీ బ్యాంకులు.. మున్ముందు ఇంకా తగ్గిపోనున్నాయా? అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయిప్పుడు. కేంద్రంలో కొలువుదీరిన దగ్గర్నుంచి ప్రభుత్వ బ్యాంకుల విలీనాలపై దూకుడుగా వ్యవహరిస్తున్న మోదీ సర్కారు.. ఇదివరకే చాలా బ్యాంకులను ఏకం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్బీహెచ్) సహా 5 అనుబంధ సంస్థలు, భారతీయ మహిళా బ్యాంక్ కలిసిపోయిన సంగతీ విదితమే. ఇక ఆంధ్రా, కార్పొరేషన్, దేనా, విజయా, ఓబీసీ, యూబీఐ, సిండికేట్, అలహాబాద్ వంటి ఇంకొన్ని బ్యాంకులను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా, ఇండియన్ బ్యాంకుల్లోకి చేర్చింది. అలాగే ఇప్పుడు మరికొన్ని బ్యాంకులు కనుమరుగవబోతున్నాయని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. చిన్న స్థాయిలో ఉన్న బ్యాంకులను పెద్ద వాటిలో కలిపేయాలని చూస్తున్న కేంద్రం.. ఇందుకు 2027 మార్చి 31ని డెడ్‌లైన్‌గా పెట్టుకున్నట్టు సమాచారం.
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐవోబీ), సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సీబీఐ), బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ), బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బీవోఎం)లు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ), ఎస్బీఐల్లో విలీనం కావచ్చని తెలుస్తున్నది. ఈ మేరకు కేంద్ర క్యాబినెట్ స్థాయి సీనియర్ అధికారులు చర్చించి, ఆ తర్వాత ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో) పరిశీలనకు పంపే వీలుందని ఓ కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి చెప్పారు. అలాగే ఈ అంశంపై అధికారిక ప్రకటన చేయడానికి ముందు అడ్డంకులేమైనా ఉంటే వాటిని తొలగించుకుంటే మంచిదన్న భావన కూడా కేంద్రంలో ఉందని తెలుస్తున్నది. గతంలో ఆయా బ్యాంకుల విలీనం సమయంలో రకరకాల ఇబ్బందులు ఎదురైనది తెలిసిందే. కాగా, దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖను సంప్రదించినా.. ఎలాంటి స్పందన రాలేదని ఓ ప్రముఖ జాతీయ ఆంగ్ల వార్తా దినపత్రిక స్పష్టం చేసింది.
2017 నుంచి 2020 మధ్య కేంద్ర ప్రభుత్వం 14 చిన్నస్థాయి ప్రభుత్వ రంగ బ్యాంకులను 6 పెద్ద ప్రభుత్వ బ్యాంకుల్లో విలీనం చేసింది. ఇక ఐడీబీఐ బ్యాంక్‌లో కేంద్ర ప్రభుత్వం వాటాను ఉపసంహరించుకోవడంతో ఆ వాటాను ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) కొనుగోలు చేసింది. సదరు బ్యాంక్‌ను పూర్తిగా ప్రైవేట్‌పరం చేయడానికి మోదీ సర్కారు కసరత్తు చేస్తున్నదీ విదితమే. ఇలా 2017లో 27గా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య ఇప్పుడు 12కు దిగొచ్చింది. ఈ 12ను కూడా ఇంకా తగ్గించాలనే దిశగా కేంద్రం వెళ్తుండటం గమనార్హం. మొత్తానికి ఓవైపు ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణలతో, మరోవైపు సర్కారీ కంపెనీల నుంచి భారీగా డివిడెండ్లను పుచ్చుకుంటూ ఖజానాను నింపుకుంటున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. ఇలా ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉనికిని కూడా ప్రశ్నార్థం చేస్తున్నదన్న విమర్శలను ఎదుర్కొంటున్నది. ఆర్థిక సంస్కరణల పేరిట సర్కారీ బ్యాంకులను విలీనాల బాట పట్టిస్తే దేశ ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో పడుతుందన్న వాదనలూ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సర్కారీ కొలువులు తగ్గిపోవడం, నిరుద్యోగం పెచ్చుమీరే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.