ఒకే దేశం.. ఒకే పన్ను అంటూ జీఎస్టీని తెచ్చిన మోదీ సర్కారు.. రాష్ర్టాల ఆదాయానికి గండికొట్టింది. రాష్ట్ర స్థాయిలో ఉన్న దాదాపు 10 పన్నులను ఎత్తివేయించి నష్టపరిహారం చెల్లిస్తామని మాయమాటలు చెప్పింది. నమ్మిన రాష్ర్టాలను నట్టేట ముంచి అప్పుల ఊబిలోకి నెట్టింది. సమాఖ్య రాజ్యాంగ స్ఫూర్తిని తుంగలో తొక్కి రాష్ర్టాలపై తమ బలవంతపు విధానాలను రుద్దిన కేంద్రం.. అడుగడుగునా ఒంటెత్తు పోకడలనే అవలంబిస్తూ వస్తున్నది. ఫలితంగా అటు రాష్ట్ర, ఇటు దేశ ఆర్థిక వ్యవస్థలు ఛిన్నాభిన్నమైపోతున్నాయి.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)తో దేశ పరోక్ష పన్నుల వ్యవస్థ రూపురేఖలే మారిపోయాయి. అయితే ఈ ఒక్క పన్నుతోనే రాష్ర్టాల ఆర్థిక వ్యవస్థలూ కుదేలయ్యాయంటే ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. రాష్ట్ర స్థాయిలోని 9 పన్నులను, జాతీయ స్థాయిలోని 8 పన్నులను మొత్తంగా 17 పన్నులను కలిపి మోదీ సర్కారు జీఎస్టీని తీసుకొచ్చింది. 2017 జూలై 1 నుంచి ఇది దేశవ్యాప్తంగా అమల్లోకి రాగా.. దీనివల్ల రాష్ర్టాలు కోల్పోయిన ఆదాయానికిగాను పరిహారం కూడా ఇస్తామని చెప్పింది. ఇలా వచ్చినదే జీఎస్టీ నష్టపరిహార సెస్సు. కానీ దీనివల్ల రాష్ర్టాలకు జరిగిన మేలు సంగతి దేవుడెరుగు.. కేంద్ర ప్రభుత్వానికి మాత్రం కాసుల పంటే పండింది.
జీఎస్టీతో రాష్ర్టాలకు వాటిల్లుతున్న ఆదాయ లోటును భర్తీ చేసేందుకు నష్టపరిహార సెస్సును కేంద్ర ప్రభుత్వం తీసుకురాగా.. ఈ రెవిన్యూ లాస్ గణనకు 2015-16 ఆర్థిక సంవత్సరాన్ని బేస్ ఇయర్‌గా నిర్ధారించారు. ప్రతీ రాష్ర్టానికీ ఇదే వర్తిస్తుంది. ఈ క్రమంలోనే 2015-16లో జీఎస్టీలో విలీనం చేసిన 9 రాష్ట్ర స్థాయి పరోక్ష పన్నుల వార్షిక వృద్ధిరేటు ఆధారంగా నష్టపరిహార మొత్తాన్ని ఏటా 14 శాతంగా నిర్ణయించారు. ఐదేండ్లపాటు (2017 జూలై 1 నుంచి 2022 జూన్ 30 వరకు) నష్టపరిహార సెస్సును కొనసాగించాలని తీర్మానించారు. ఈలోగా జీఎస్టీ వసూళ్లు పెరిగి అంతా సర్దుకుంటుందన్నది కేంద్రం ఆలోచన. అయితే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ ఇటీవల విడుదల చేసిన అధ్యయనం ప్రకారం 2018-19 నుంచి 2023-24 మధ్య రాష్ర్టాల ఆదాయంపై జీఎస్టీ ప్రభావాన్ని మూల్యంకనం చేస్తే..
జీఎస్టీ నష్టపరిహారం చెల్లింపులపై కేంద్రం మాటమార్చిన నేపథ్యంలో రుణాల సమీకరణలో భాగంగా ఒక్కో రాష్ట్రం విడివిడిగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)ను సంప్రదించడం మొదలుపెట్టాయి. దీంతో పాలనాపరంగా సంక్లిష్ట పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో రాష్ర్టాల తరఫున ఆర్బీఐ నుంచి రూ.2.7 లక్షల కోట్లను కేంద్ర ప్రభుత్వమే రుణంగా తీసుకున్నది. 2020-21లో రూ.1.1 లక్షల కోట్లు, 2021-22లో రూ.1.6 లక్షల కోట్ల రుణాలను పొందింది. అయితే ఈ అప్పులను రాష్ర్టాలే తీర్చాల్సి ఉంటుందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) చెప్పడం గమనార్హం.
కారణాలు ఏమైనా ఆర్బీఐ నుంచి తీసుకున్న అప్పులను తామే చెల్లిస్తామని కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ మేరకు 2022 జూన్ 24న జీఎస్టీ చట్టంలో సవరణల్ని కూడా చేసింది. ఈ క్రమంలోనే 2026 మార్చి 31దాకా జీఎస్టీ నష్టపరిహార సెస్సును పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే 2023-24లో కొన్ని రాష్ర్టాలు జీఎస్టీ నష్టపరిహార బకాయిలను అందుకున్నాయి. అయితే సెస్సును పొడిగించి మూడున్నరేండ్లు గడిచినా ఆర్బీఐ నుంచి తెచ్చిన రూ.2.7 లక్షల కోట్ల రుణాన్ని కేంద్రం పూర్తిగా తీర్చలేకపోయింది. మరోవైపు ఇదే సమయంలో జీఎస్టీ నష్టపరిహార సెస్సు ద్వారా కేంద్రం రూ.6.1 లక్షల కోట్లను వసూలు చేయడం గమనార్హం. బడ్జెట్ డాక్యుమెంట్లే సాక్ష్యం. మరి ఈ సొమ్మంతా ఏమైంది? అన్న ప్రశ్నకు సమాధానాలు మాత్రం లేవు.
జీఎస్టీ విధానంలో తాజా సవరణలతో.. మూలిగే నక్కమీద తాటిపండుపడ్డ చందంగా తయారైంది రాష్ర్టాల పరిస్థితి. ఇస్తామన్న నష్టపరిహారమే దిక్కులేక దిగాలుగా ఉన్న రాష్ర్టాలకు.. సగానికి తగ్గిన పన్ను రేట్ల స్లాబులతో ఆదాయం ఇంకా క్షీణిస్తున్నది మరి. ఈ క్రమంలోనే ఆగస్టు 29న దేశంలోని 8 బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఆర్థిక, రెవిన్యూ మంత్రులు.. జీఎస్టీ సవరణలతో వాటిల్లుతున్న నష్టాల మాటేమిటి అని కేంద్రాన్ని నిలదీశారు. అయితే ఎప్పట్లాగే మభ్యపెట్టిన కేంద్రం.. ఈ నెల (సెప్టెంబర్) 3న చేయాల్సింది చేసేసింది. ఏదిఏమైనా రాష్ర్టాలకు మాత్రం చట్టపరంగా ఇవ్వాల్సిన నిధులను ఇవ్వకుండా అన్యాయమే చేస్తున్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయిప్పుడు.
2019 సెప్టెంబర్‌లో గోవాలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కేంద్రం ఒక్కసారిగా అడ్డం తిరిగింది. ఇకపై తాము జీఎస్టీ నష్టపరిహారాన్ని చెల్లించలేమని, ఆర్థికపరమైన ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నామని రాష్ర్టాల ప్రతినిధులకు తేల్చిచెప్పింది. అదే ఏడాది నవంబర్‌లో ఈ మేరకు ఓ అధికారిక ప్రకటనను కూడా విడుదల చేసింది. అప్పట్నుంచి అన్నిచోట్లా బహిరంగంగానే జీఎస్టీతో వాటిల్లుతున్న ఆదాయ నష్టాలను ఆయా మార్కెట్ల నుంచి రుణాలను సమీకరించి పూడ్చుకోవాలని మోదీ సర్కారు వ్యూహాత్మకంగా చెప్తూ వస్తున్నది. ఈ క్రమంలోనే నష్టపరిహారాన్ని ఎగ్గొట్టింది. తద్వారా జీఎస్టీ చట్టం-2017ను కేంద్రం ఉల్లంఘించినైట్టెంది. జీఎస్టీ అమలు సమయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘సహకార సమాఖ్య’ అంటూ చేసిన వాగ్ధానాలూ మంటగలిసిపోయాయి.
2020లో వచ్చిన కాగ్ నివేదిక ప్రకారం 2017-18, 2018-19 ఆర్థిక సంవత్సరాల్లో రూ.47,272 కోట్ల జీఎస్టీ సెస్సును రాష్ర్టాలకు నష్టపరిహారంగా ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం.. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా (సీఎఫ్ఐ)కు తరలించింది.
సెస్సులనేవి నిర్ధిష్ట ప్రయోజనాలనుద్దేశించి విధించేవి. అయినప్పటికీ ఆ నిధులను దుర్వినియోగపరుస్తూ సీఎఫ్ఐకి మోదీ సర్కారు అక్రమంగా బదలాయించింది.
35 సెస్సులు, లెవీలు, ఇతర చార్జీల ద్వారా 2018-19లో వసూలైన రూ.2,74,592 కోట్లలో రిజర్వ్ ఫండ్స్/బోర్డుల్లోకి బదిలీ అయినవి రూ.1,64,322 కోట్లేనని కాగ్ చెప్తున్నది. మిగతా నిధులన్నీ సీఎఫ్ఐ వద్దే ఉన్నాయంటున్నది.
ఒక్క 2018-19లో వసూలైన సర్‌చార్జ్, సెస్సు నిధుల్లోనే 40 శాతం దుర్వినియోగమైనట్టు కాగ్ తేల్చింది. ఇలా ఇన్నేండ్లలో ఎన్ని నిధులు దుర్వినియోగమయ్యాయన్న లెక్కలు తేలాల్సి ఉన్నది.