వికారాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): మొబిలిటీ వ్యాలీకి కాంగ్రెస్ గ్రహణం పట్టింది. ఎలక్ట్రిక్ వాహనాలు, విడిభాగాలను రాష్ట్రంలో తయారు చేయాలనే ఉద్దేశంతో కేసీఆర్ సర్కార్ ఈ వినూత్న ప్రాజెక్టును వికారాబాద్ జిల్లాలో ఏర్పాటు చేయాలని తలపించింది. ఇందుకోసం భూ సేకరణను కూడా పూర్తి చేసింది. ఆ తర్వాతి క్రమంలో రాష్ట్రంలో ప్రభుత్వం మారటంతో ఈ బృహత్ ప్రాజెక్టు అటకెక్కే సూచనలు కనిపిస్తున్నాయి. భూ సేకరణ రెండేండ్లు పూర్తైయినప్పటికీ ఈ మొబిలిటీ వ్యాలీకి సంబంధించిన పనులు మాత్రం ముందుకు సాగడం లేదు.
అరకొర నిధులు మాత్రమే కేటాయిస్తున్నది. స్థానికుల నుంచి ప్రజాప్రతినిధుల నుంచి ఒత్తిడి రావడంతో గడిచిన ఏడాదిన్నరలో ఈ మొబిలిటీ వ్యాలీకోసం రాష్ట్ర సర్కార్ రూ.45 కోట్ల నిధులను మాత్రమే కేటాయించింది. దీంతో పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఈ వ్యాలీలో పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చిన కంపెనీలకు కాంగ్రెస్ సర్కార్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో వారి పెట్టుబడులపై సందిగ్ధత నెలకొన్నది. అంతేకాకుండా కేసీఆర్ ప్రభుత్వం పారిశ్రామిక రంగంలో టీఎస్ఐఐసీ, టీఎస్-ఐపాస్ వంటి నూతన శకానికి నాంధి పలకడంతోపాటు పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించగా, మరీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి నూతన ఇండస్ట్రీయల్ పాలసీని ఇప్పటివరకు అమల్లోకి తీసుకురాకపోవడం తదితర అంశాలపై పారిశ్రామికవేత్తల్లో ఆందోళన నెలకొన్నది.
ఈ మొబిలిటీ వ్యాలీతో రూ.50 వేల కోట్ల పెట్టుబడులతోపాటు 4 లక్షల మందికి ఉద్యోగాలను కల్పించడమే లక్ష్యంగా గత ప్రభుత్వం ఈ భారీ ప్రాజెక్టును మంజూరు చేసింది. ఎలక్ట్రిక్ వాహనాలు, విడిభాగాలను తయారు చేసే పరిశ్రమలను ఒక్కతాటిపైకి తీసుకురావాలనే ఉద్దేశంతో 940 ఎకరాల స్థలంలో ఈ మొబిలిటీ వ్యాలీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అయితే మొబిలిటీ వ్యాలీకి సంబంధించి భూ సేకరణ ప్రక్రియ కూడా రెండేళ్ల క్రితం పూర్తయ్యింది. అయితే భూసేకరణ ప్రక్రియ పూర్తి కావడంతో టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో భూ అభివృద్ధి పనులు ఇంకా ప్రారంభంకాలేదు. మరోవైపు మొబిలిటీ వ్యాలీని ఏర్పాటు చేసేందుకుగాను స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ భూములను పారిశ్రామికాభివృద్ధికి ఇచ్చిన ప్రజలకు గత ప్రభుత్వం నష్టపరిహారాన్ని అందజేసింది. ఎన్కతల గ్రామ పంచాయతీ సర్వే నెంబర్ 174, 198 పరిధిలోని 636.11 ఎకరాల అసైన్డ్ భూములకు సంబంధించిన 400 మంది రైతులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో ఎకరాకు రూ.17 లక్షల చొప్పున నష్టపరిహారాన్ని జమ చేసింది. అదేవిధంగా అసైన్డ్దారుల కుటుంబాల్లోని అర్హులైన వారికి తెలంగాణ మొబిలిటీ వ్యాలీలో ఉద్యోగాలను కూడా కల్పించేందుకు గత ప్రభుత్వం నిర్ణయించింది.