హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకున్న అనుకూలతలను వివరించి, పెట్టుబడులు పెట్టేలా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని అమెరికాలోని ఇండియానా రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు కోరారు. సోమవారం అసెంబ్లీ కమిటీ హాల్లో ఇండియానా సెక్రటరీ ఆఫ్ స్టేట్ డియెగో మోరాలెస్ నేతృత్వంలో ప్రతినిధుల బృందం మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ప్రోత్సాహకాలను శ్రీధర్‌బాబు వారికి తెలియజేశారు. కొత్త టెక్నాలజీలకు హబ్‌గా మారుతున్న తెలంగాణవైపు యావత్తు ప్రపంచం చూస్తున్నదన్నారు. ఐటీ రంగంలోనేగాక బయోటెక్, ఫార్మా తదితర రంగాల్లోనూ అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ గుర్తింపు తెచ్చుకున్నదని చెప్పారు. మెడికల్ డివైజెస్, ఔషధ పరిశ్రమ, జీవ విజ్ఞానం, వ్యవసాయం, తయారీ తదితర రంగాల్లో ఇండియానా రాష్ట్రంతో కలిసి పనిచేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.