Renewsys India | హైదరాబాద్, ఫిబ్రవరి 19(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో భారీ పెట్టుబడి పెట్టడానికి మరో మరో సంస్థ ముందుకొచ్చింది. రూ.6 వేల కోట్ల పెట్టుబడితో రాష్ట్రంలో సోలార్ పీవీ మాడ్యూల్, పీవీ సెల్ తయారీ యూనిట్లను నెలకొల్పడానికి దిగ్గజ సంస్థ రెన్యూసిస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ముందుకొచ్చింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో సోమవారం అధికారిక ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. రాష్ట్ర మంతి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సమక్షంలో ఐటీ శాఖ ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, కంపెనీ ఉన్నతాధికారులు ఒప్పంద పత్రాన్ని మార్చుకున్నారు.
ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ..ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీని రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని, ఈ రంగంలోకి మరిన్ని పెట్టుబడులు ఆకట్టుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇందుకోసం సమగ్ర ఇంధన పాలసీని సైతం రూపొందిస్తున్నట్లు మంత్రి చెప్పారు. కర్ణాటక, మహారాష్ట్రలో రెన్యూసిస్‌కు ప్లాంట్లు ఉన్నప్పటికీ, హైదరాబాద్‌లో అతిపెద్ద తయారీ యూనిట్‌ను నెలకొల్పేందుకు ముందుకు రావడం చాలా సంతోషంగా ఉన్నదన్నారు. ఈ యూనిట్‌తో హైదరాబాద్ సోలార్ పరికరాల తయారీ హబ్‌గా మారుతున్నదనే విశ్వసాన్ని ఆయన వ్యక్తంచేశారు. ఈ ప్లాంట్‌తో వచ్చే ఐదేండ్లు కాలంలో 11వేల మందికి ఉపాధి లభించనున్నది. ఇప్పటికే హైదరాబాద్‌తోపాటు బెంగళూరులో మూడు ఉత్పత్తి కేంద్రాలున్నాయి.
హైదరాబాద్‌లోని టీఎస్ఐఐసీ ఏరోస్పేస్ పారులో అపోలో మైక్రోసిస్టమ్స్ సంస్థ ఏర్పాటు చేస్తున్న వెపన్స్ సిస్టమ్స్ ఇంటిగ్రేషన్ యూనిట్ భూమి పూజ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అపోలో మైక్రోసిస్టమ్ యూనిట్ ఏర్పాటుతో వచ్చే మూడేండ్లకాలంలో 400 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయన్నారు. తెలంగాణలో ఏరోస్పేస్, రక్షణ రంగాల్లో ఎన్నో పరిశ్రమలు వచ్చాయన్నారు. బోయింగ్, ఎయిర్ బస్, శాఫ్రాన్, జీఈ ఏవియేషన్ వంటి సంస్థలకు హైదరాబాద్ నిలయంగా మారిందని, ఈ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు ఉత్తమ అవార్డులను అందుకుందని వివరించారు.