హైదరాబాద్, ఆగస్టు 13(నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు అరుదైన గౌరవం దక్కింది. అనలిటిక్స్ ఇండియా మ్యాగజైన్ తాజాగా ప్రకటించిన ‘ఇండియాస్ 100 మోస్ట్ ఇన్ఫ్లూయెన్షియల్ పీపుల్ ఇన్ ఏఐ- 2025’ జాబితాలో ఆయనకు చోటు లభించింది. సమర్థవంతమైన నాయకత్వం, నూతన ఆవిష్కరణలకు ప్రోత్సాహామిస్తూ భారత్‌ను ఏఐ రంగంలో అగ్రగామిగా తీర్చి దిద్దేందుకు కృషి చేస్తున్న వ్యక్తులకు ఇందులో చోటు కల్పించారు.
విధాన రూపకర్తల విభాగంలో శ్రీధర్ బాబుతో పాటు కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, పీయూష్ గోయల్, కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, ఇండియా ఏఐ మిషన్ సలహాదారు ఆకృత్ వైష్, ఇండియా ఏఐ మిషన్ సీఈవో, ఎన్ఐసీ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్, ఎన్ పీసీఐ సీఈవో దిలీప్ అస్బే, నీతి ఆయోగ్ మాజీ సీఈవో అమితాబ్ కాంత్, నాస్కామ్ మాజీ అధ్యక్షులు దేబజాని ఘోష్ తదితర ప్రముఖులను ఎంపిక చేసినట్లు నిర్వాహకులు ప్రకటించారు.
ఇది నా ఒక్కడికి లభించిన గుర్తింపు కాదు.. యావత్తు తెలంగాణ ప్రజలకు దక్కిన గౌరవం. సమ్మిళిత వృద్ధి, మెరుగైన జీవితాలను అందించేందుకు ఏఐని వినియోగించాలన్న మా ప్రభుత్వ సుదూర దృష్టికి ఈ గుర్తింపు నిదర్శనమని మంత్రి అన్నారు.