హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని ఆస్ట్రేలియా దిగ్గజ సంస్థ ‘ఒరికా’ ప్రతినిధులను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కోరారు. ‘ఆస్బయోటెక్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ 2025’లో కీలకోపన్యాసం చేసేందుకు ఆస్ట్రేలియా వెళ్లిన మంత్రి.. బుధవారం మెల్బోర్న్లో ఒరికా సంస్థ సీఈవో, ఎండీ సంజీవ్ గాంధీతోపాటు సంస్థ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ‘ఒరికా’ ప్రస్తుత కార్యకలాపాలు, భవిష్యత్తు విస్తరణ ప్రణాళికలపై చర్చించారు. ఇన్నోవేషన్, టెక్నాలజీ హబ్‌లను ఏర్పాటు చేసేందుకు అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు తెలంగాణ వైపు చూస్తున్నాయని.. జీసీసీలు, పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్రం అత్యంత అనుకూలంగా ఉందన్నారు.
కలిసి పనిచేస్తాం: సంజీవ్ గాంధీ
ప్రస్తుతం హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న జీసీసీలో డిజిటల్ ఇంజినీరింగ్, ఆటోమేషన్, అడ్వాన్స్డ్ అనలిటిక్స్ తదితర రంగాల్లో 600 మంది హైసిల్డ్ నిపుణులకు ఉద్యోగాలు కల్పించామని, రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని సంజీవ్ గాంధీ తెలిపారు. తెలంగాణలో కార్యకలాపాల విస్తరణ, వివిధ రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కాగా, పారిశ్రామిక పేలుడు పదార్థాల తయారీల్లో ఒరికా అంతర్జాతీయ అగ్రగామి సంస్థగా ప్రఖ్యాతి గాంచింది.
‘ఆర్ఎంఐటీ’ యూనివర్సిటీతో ఎల్వోఐ
మెల్బోర్న్లోని ప్రముఖ యూనివర్సిటీ ‘ఆర్ఎంఐటీ’తో రాష్ట్ర ప్రభుత్వం లెటర్ ఆఫ్ ఇంటెంట్(ఎల్వోఐ) కుదుర్చుకున్నట్టు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. లైఫ్ సైన్సెస్ రంగంలో ఇన్నోవేషన్, పరిశోధన, అభివృద్ధి, ఉన్నత విద్య, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా రెడీ టూ వర్ ఫోర్స్ తయారీ తదితర అంశాల్లో ద్వైపాక్షిక సహకారానికి ఈ ఒప్పందం దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. కాగా, మంత్రి సమక్షంలో తెలంగాణ లైఫ్ సైన్సెస్ ఫౌండేషన్ సీఈవో శక్తి నాగప్పన్, ఆర్ఎంఐటీ యూనివర్సిటీ డిప్యూటీ వైస్-చాన్స్‌లర్ ప్రొఫెసర్ కేథరీన్ ఇట్సియోపౌలోస్ ఎల్‌వోఐపై సంతకాలు చేశారు.
ఎడ్యుకేషన్ సిటీపై ఆసక్తి
తెలంగాణలో ‘ప్లగ్ అండ్ ప్లే’ విధానంలో ‘ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ సిటీ’ని ఏర్పాటు చేసేందుకు ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ విద్యా సంస్థ విక్టోరియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(వీఐటీ) ఆసక్తి చూపుతున్నది. ఈ మేరకు వీఐటీ బోర్డు సభ్యుడు, మాజీ పార్లమెంటేరియన్ అలన్ గ్రిఫిన్ ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న మంత్రి శ్రీధర్ బాబును మెల్బోర్న్లో కలిసి తమ ఆసక్తిని వ్యక్తంచేశారు. దీంతో ఇకడి అనుకూలతలు, విధానాలు, సదుపాయాలు, యువత ప్రతిభ తదితర అంశాలను ఈ సందర్భంగా మంత్రి ఆయనకు వివరించారు. ఈ సమావేశంలో వీఐటీ ప్రతినిధి అర్జున్ సూరపనేని పాల్గొన్నారు.