హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): నూతన ఆవిష్కరణలకు ప్రపంచ గమ్యస్థానంగా హైదరాబాద్ తన స్థానాన్ని సుస్థిరపరుచుకుంటున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. హైదరాబాద్‌లో సత్వ నాలెడ్జ్ పార్క్‌లో ఎవర్నార్థ్ హెల్త్ సర్వీసెస్ ఏర్పాటు చేసిన ఇన్నోవేషన్ హబ్‌ను ఆయన మంగళవారం ప్రారంభించారు. 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ జీసీసీ సెంటర్‌తో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో మందికి ఉపాధి కల్పించనున్నదని, దీంట్లోభాగంగా తొలి విడుత వెయ్యి మంది ప్రతిభావంతులకు ఉద్యోగ అవకాశాలను లభించనున్నాయని, ఈ ఆధునిక కేంద్రం హైదరాబాద్‌లోని నిపుణుల సామర్థ్యాన్ని వినియోగించుకొని ఆరోగ్యరంగంలో ఐటీ వినియోగాన్ని మరింత విసృతపరుస్తున్నదన్న ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. భారత్‌లో ఏర్పాటు చేసిన తొలి గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ ఇదేనన్నారు. బెంగళూరుకు చెందిన సిగ్నా హెల్త్ సొల్యుషన్స్‌తో కలిసి భారత్‌లో డాటా, అనలిటిక్స్ సేవలు అందిస్తున్నది. ఈ భాగస్వామ్యం ద్వారా ఎవర్ నార్థ్ 1.9 కోట్ల మంది భారతీయులకు ఆరోగ్య సేవలు అందిస్తున్నది. 30కి పైగా దేశాల్లో కార్యకలాపాలను విస్తరించిన ఎవర్నార్థ్లో ప్రస్తుతం 75 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.