హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ) : భావితరాల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణను దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మాడల్‌గా తీర్చిదిద్దేలా ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్(ఎఫ్‌టీసీసీఐ) ఆధ్వర్యంలో మంగళవారం ‘ఎఫ్‌టీసీసీఐ ఎక్సలెన్స్ అవార్డ్స్-2026’ ప్రదానోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భవిష్యత్తు కోసం ఎదురు చూడకుండా, దాన్ని నిర్మించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్టు తెలిపారు. ఐటీ, లైఫ్ సైన్సెస్ నుంచి తయారీ, డీప్-టెక్ వరకు తెలంగాణను దేశంలోనే అత్యంత ఆకర్షణీయమైన వృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా మంత్రి వివరించారు.
పరిశ్రమ 4.0 విప్లవంలో భాగంగా దూసుకొస్తున్న ఆటోమేషన్, డీప్-టెక్ సవాళ్లను ఎదురొనేలా రాష్ట్రంలో కాంప్రహెన్సివ్ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేస్తున్నామన్న ఆయన… అదే సమయంలో భవిష్యత్తు తరాలకు మేలు జరిగేలా స్థిరమైన, పర్యావరణహిత పారిశ్రామిక వృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని చెప్పారు. రాబోయే రోజుల్లో పారిశ్రామికాభివృద్ధి కేవలం భూమి, మూలధనంపైనే కాకుండా.. మేధో సంపత్తి, నాలెడ్జ్ ఎకానమీ ఆధారంగానే సాధ్యమవుతుందన్నారు. అందుకుగానూ పరిశ్రమల అవసరాలకు, విద్యాసంస్థల శిక్షణకు మధ్య ఉన్న అంతరాన్ని పూడ్చాల్సిన అవసరముందన్నారు. రాష్ట్రానికి కొత్త పెట్టుబడులను తీసుకొచ్చి ఇకడి యువతకు ఉపాధి అవకాశాలను కల్పించాలనే లక్ష్యంతోనే ముందుకెళ్తున్నట్టు శ్రీధర్ బాబు వెల్లడించారు.