హైదరాబాద్, మే 3(నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేస్తున్న ఫ్యూచర్ సిటీలో ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్ సిటీ(ఈ-సిటీ)ని ఏర్పాటు చేయబోతున్నట్టు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రకటించారు. టెలికాం ఉత్పత్తుల తయారీ సంస్థలైన సిరా నెట్ వర్స్(తైవాన్), ఎల్ సీజీసీ రెజల్యూట్ గ్రూప్(తెలంగాణ) సంయుక్తంగా రాష్ట్రంలో రూ.300 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చాయి.
ఈ సందర్భంగా ఆ సంస్థల ప్రతినిధులతో మంత్రి శనివారం సచివాలయంలో సమావేశమై… ఎలక్ట్రానిక్ పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వారికి వివరించారు. ఈ తరహ పరిశ్రమల ఏర్పాటులో పారిశ్రామికవేత్తలకు ఇబ్బందులు లేకుండా సంబంధిత అధికారులతో ప్రత్యేక టాస్ఫోర్స్ను ఏర్పాటు చేస్తామన్నారు.
తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములయ్యేందుకు ముందుకొచ్చిన సిరా నెట్ వర్స్, ఎల్ సీజీసీ రెజల్యూట్ గ్రూప్ ప్రతినిధులకు మంత్రి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటామని వారికి హామీ ఇచ్చారు.