KCR | హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 27 (నమస్తే తెలంగాణ): కేసీఆర్ అంటే.. కీప్ సిటీ రన్నింగ్ అని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారక రామారావు అన్నారు. నిరంతరం పని చేయడమే రాష్ట్ర ప్రభుత్వ మంత్రమని స్పష్టం చేశారు. హైదరాబాద్లో ఫ్రెంచ్ కంపెనీ టెలిపర్ఫార్మెన్స్ నూతనంగా ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని మంత్రి కేటీఆర్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భారీ వర్షాలు కురుస్తున్నా సమర్థవంతంగా సేవలు అందిస్తున్నట్టు తెలిపారు. నగరంలో జీహెచ్ఎంసీ, పోలీస్, వైద్య ఆరోగ్య శాఖలు బాగా పనిచేస్తున్నాయన్నారు. ఇక టెలిపర్ఫార్మెన్స్.. దాని పేరుకు తగ్గట్టుగానే మంచి పనితీరును కనబర్చాలన్న ఆకాంక్షను వెలిబుచ్చారు.
అయితే కార్పొరేట్, ఐటీ కంపెనీలు ఒకేచోట తమ కార్యకలాపాలను నిర్వహించకుండా.. నగరంలోని ఇతర ప్రాంతాలకూ విస్తరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఐటీ కంపెనీలు మాదాపూర్, దాని పరిసర ప్రాంతాల్లోనేగాక, మలక్పేట, ఉప్పల్ వంటి ఇతర చోట్ల కూడా కార్యాలయాలను ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు. ఈ క్రమంలోనే ఆ దిశగా ఆలోచించాలంటూ టెలిపర్ఫార్మెన్స్ సీఈవో అనిష్కు మంత్రి సూచించారు. దీనివల్ల ఆయా ప్రాంతాలకు చెందిన ఉద్యోగులకు ప్రయోజనకరంగా ఉంటుందని, ముఖ్యంగా ప్రయాణ దూరం తగ్గి ఎంతో సమయం ఆదా అవుతుందని చెప్పారు. ఈ ప్రారంభోత్సవంలో టెలిఫర్ఫార్మెన్స్ కంపెనీ ప్రతినిధి మమత, ఇతర ఉద్యోగులు పాల్గొన్నారు.

Cm Kcr