ఆసియాలోనే అతిపెద్ద స్టెంట్స్ తయారీ ప్లాంట్ రాష్ట్రంలో ఏర్పాటైంది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం సుల్తాన్‌పూర్‌లోని మెడికల్ డివైజెస్ పార్క్‌లో సహజానంద్ మెడికల్ టెక్నాలజీస్ లిమిటెడ్ (ఎస్ఎంటీ) దీనిని ఏర్పాటు చేసింది. తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు శుక్రవారం ప్రారంభించారు. ఇక్కడ తయారైన స్టెంట్స్.. 70 దేశాలకు ఎగుమతి కానున్నాయి. కంపెనీ ఏటా 10 లక్షల స్టెంట్స్‌ను తయారు చేయనున్నది. దీంతో 2 వేల మందికి ఉపాధి లభించనున్నది. మంత్రి కేటీఆర్ ప్రోత్సాహంతోనే సుల్తాన్‌పూర్‌లో తొలి స్టెంట్స్ తయారీ ప్లాంట్‌ను ప్రారంభించగలిగామని ఎస్ఎంటీ చైర్మన్ ధీరజ్ లాల్ తెలిపారు.
హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): స్టెంట్ల క్యాపిటల్‌గా తెలంగాణ మారబోతోంది. సంగారెడ్డి జిల్లాలోని అమీన్పూర్ మండలం సుల్తాన్పూర్ మెడికల్ డివైజెస్ పార్క్‌లో సహజానంద్ మెడికల్ టెక్నాలజీస్(ఎస్ఎంటీ) స్టెంట్ల తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. శుక్రవారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమ శాఖ మంత్రి కే తారక రామారావు దీన్ని ప్రారంభించారు. రూ.250 కోట్ల ప్రారంభ పెట్టుబడితో సంజీవని పేరిట ఎస్ఎంటీ ఈ ఉత్పాదక కేంద్రాన్ని తీసుకురాగా.. మొత్తం రూ.530 కోట్లతో మూడు దశల్లో ఈ ప్రాజెక్టు పూర్తి కానున్నది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ర్టానికి మరో అంతర్జాతీయ సంస్థ రావడం సంతోషంగా ఉందన్నారు. ఎస్ఎంటీ ఆసియాలోనే అతిపెద్ద స్టెంట్లు, బెలూన్ల ఉత్పత్తి పరిశ్రమని తెలిపారు. ఇక 70 దేశాలకు హైదరాబాద్ కేంద్రంగా స్టెంట్లు, బెలూన్ల ఎగుమతి జరుగనుందన్నారు. కరోనాతో ప్రపంచం స్తంభించిపోయినా ఎస్ఎంటీ మాత్రం వెనక్కి తగ్గలేదన్నారు. కేవలం మూడేండ్లలోనే ఇంతపెద్ద ప్లాంట్‌ను స్థాపించడం.. ఆ సంస్థ నిబద్ధతకు నిదర్శనమని కొనియాడారు. వైద్య ఉపకరణాల తయారీ, పరిశోధనల నేపథ్యంలో హైదరాబాద్‌కు ప్రాధాన్యం పెరిగిందని చెప్పారు.
ఉద్యోగాల్లో స్థానిక యువతకే ప్రాధాన్యత
ఎస్ఎంటీ స్టెంట్లు, బెలూన్ల ఉత్పత్తి పరిశ్రమతో సుమారు 2 వేల మందికి ఉపాధి లభిస్తుందని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ యువతకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని సంస్థ ప్రతినిధులకు ముందే చెప్పామని గుర్తుచేశారు. ఒక పరిశ్రమ స్థాపించడం వల్ల రాష్ట్ర ఆర్థికాభివృద్ధితోపాటు యువతకు ఉపాధి లభిస్తుందన్నారు. ఎస్ఎంటీ ద్వారా ఏటా 1.2 మిలియన్ల కార్డియాక్ స్టెంట్లు, 2 మిలియన్ల కార్డియాక్ బెలూన్లు ఉత్పత్తి అవుతాయని తెలిపారు. వృద్ధుల కోసం, టీఏవీఐ, గుండెలో రంధ్రం ఉన్న పిల్లల కోసం ఆక్టూడర్ వంటి ఆధునిక సాంకేతికతను ఉపయోగించి తయారు చేస్తారన్నారు. గుండె వ్యాధులతో బాధపడేవారికి వేసే స్టెంట్లు ఇప్పటివరకూ విదేశాల నుంచే దిగుమతి అవుతున్నాయని, ఇకపై మన దేశం నుంచి విదేశాలకు ఎగుమతి చేస్తామని చెప్పారు. దీనివల్ల పేదలకు వైద్యం తక్కువ ధరకే దొరుకుతుందన్న ఆశాభావాన్ని కేటీఆర్ వ్యక్తం చేశారు.
కేంద్ర విధానాలు మారాలి..
దేశంలోకి ప్రస్తుతం 80 శాతం వైద్య ఉపకరణాలను విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నామని కేటీఆర్ తెలిపారు. భారత్‌కు పరిశ్రమలు రాకపోవడానికి కేంద్ర విధానాలే కారణమని ధ్వజమెత్తారు. అన్ని వనరులు, అవకాశాలున్నా నరేంద్ర మోదీ విధానాలు నచ్చక పరిశ్రమలు ముందుకు రావడం లేదన్నారు. బయో ఏసియా సదస్సు సందర్భంగా పారిశ్రామికవేత్తలను తెలంగాణకు రావాలని ఆహ్వానించామని గుర్తుచేశారు. వైద్య పరికరాలు ఇక్కడే తయారు చేసుకోవచ్చని చెప్పామన్నారు. అయితే ఇక్కడ తయారు చేయడం కంటే చైనా నుంచి దిగుమతి చేసుకుంటే తక్కువ ధరకు వస్తాయని కొందరు పారిశ్రామికవేత్తలు అన్నారని తెలిపారు. కేంద్ర విధానాలు అంత దరిద్రంగా ఉన్నాయని వాళ్లు చెప్పకనే చెప్పారన్నారు. తెలంగాణలో పరిశ్రమల స్థాపనకు రెడ్ కార్పెట్ వేస్తున్నామన్న ఆయన.. పరిశ్రమ స్థాపిస్తామని ముందుకొస్తే అన్ని వసతులు కల్పిస్తున్నామని, ఎటువంటి ఇబ్బంది లేకుండా అనుమతులు, రాయితీల వంటి సదుపాయాలన్నీ కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. అందుకే తెలంగాణకు పరిశ్రమలు క్యూ కడుతున్నాయన్నారు. తెలంగాణలోని పరిస్థితి దేశమంతటా రావాలంటే కేంద్ర విధానాలు మారాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యే జీ మహిపాల్ రెడ్డి, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, టీఎస్ఐఐసీ చైర్మన్ జీ బాలమల్లు, వీసీ అండ్ ఎండీ నర్సింహారెడ్డి, డైరెక్టర్ శక్తి నాగప్పన్ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ అద్భుతాలకు నెలవు…
భవిష్యత్తులో తెలంగాణలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో దూరదృష్టి ఉన్నది. ప్రపంచాన్నే ఆకర్షించే శక్తి ఇప్పుడు తెలంగాణ సొంతం. కేటీఆర్ గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. ఎక్కడైతే విద్య విరాజిల్లుతుందో.. అక్కడ సంక్షేమం వికసిస్తుంది. ఎస్ఎంటీ సంస్థ చేసేది వ్యాపారం కాదు.. సేవ. ఈ పరిశ్రమ స్థాపనతో ఎంతోమందికి వైద్యం చేరువ కాబోతోంది, ఇది ముమ్మాటికీ దైవ సంకల్పమే.
-దేవీ ప్రసాద్ దాస్ స్వామి, ఆధ్యాత్మికవేత్త
రాష్ట్ర ప్రభుత్వ చొరవతోనే..
ఎస్ఎంటీ ప్లాంట్‌ను ఇంత త్వరగా పూర్తిచేయడంలో తెలంగాణ సర్కారు చూపిన చొరవ గొప్పది. ముఖ్యంగా కేటీఆర్ అందించిన సహాయ, సహకారాలు మరువలేం. మా సంస్థ ద్వారా జరిగే ఉత్పత్తిలో 65 శాతం ఎగుమతులే. మా ప్రపంచశ్రేణి ఆర్అండ్డీ సెంటర్లో అత్యున్నతమైన 300 మంది సైంటిస్టులు పనిచేస్తారు.
-భార్గవ్ కొటాడియా, ఎస్ఎంటీ ఎండీ
సహజానంద్ మెడికల్ టెక్నాలజీస్
ఇండస్ట్రీ : మెడికల్ ఈక్విప్మెంట్ తయారీ
ఉద్యోగులు : 5 వేల మంది
ప్రధాన కార్యాలయం : సూరత్
స్థాపించింది : 1998
ప్రత్యేకత : స్టెంట్స్, ముఖ్యమైన మెడికల్ పరికరాలు