హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 19 (నమస్తే తెలంగాణ): స్టార్టప్ రంగంలో అనేక అవకాశాలు ఉన్నాయని, రాష్ట్రంలో యువతను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అత్యంత అనుకూలమైన వాతావరణం కల్పించిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు. బుధవారం హైదరాబాద్‌లో ఫౌండర్స్ ల్యాబ్ స్టార్టప్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసి వారిని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి ఫౌండర్స్ ల్యాబ్ నడుం బిగించిందన్నారు.
ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం టీ-హబ్, టీ-వర్క్స్, అగ్రి హబ్, వీ హబ్ వంటి పలు వేదికలను ఏర్పాటు చేసి వినూత్న ఆలోచనలు కార్యరూపం దాల్చడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. ఫౌండ ర్స్ ల్యాబ్ కాలేజీ స్థాయి నుంచే విద్యార్థులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే విధంగా వారికి శిక్షణ అందించడం ఒక మంచి పరిణామమన్నారు. ఫౌండర్స్ ల్యాబ్ సీఈవో శకుంతల కాసరగడ్డ మాట్లాడుతూ.. ఫార్మా, వ్యవసాయ రంగాలను ఇంజనీరింగ్ విభాగంతో అనుసంధానం చేస్తూ సమాజానికి అవసరమైన అనేక ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. విద్యా సంస్థలు, ప్రభుత్వ సహకారంతో వారికి కావాల్సిన అన్ని అంశాల్లో పూర్తి సహకారం అందిస్తామని, వారిని పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్నారు.