న్యూఢిల్లీ, జూలై 13: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను రూ.471.6 కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్లు మైండ్‌ట్రీ ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.343.4 కోట్లతో పోలిస్తే 37 శాతం అధికమని పేర్కొంది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 36 శాతం ఎగబాకి రూ.3,121.10 కోట్లకు చేరుకున్నట్లు బీఎస్ఈకి సమాచారం అందించింది.
ఆశాజనక ఆర్థిక ఫలితాలతో ఈ ఏడాది ఆరంభించినట్లు, మార్జిన్లు అత్యధికంగా ఉండటం, ఆర్డర్లు రికార్డు స్థాయిలో ఉండటంతో ఇది సాధ్యమైందని మైండ్‌ట్రీ సీఈవో, ఎండీ దేబాషిస్ ఛటర్జీ తెలిపారు. గత త్రైమాసికంలో సంస్థకు 570 మిలియన్ డాలర్ల విలువైన ఆర్డర్లు వచ్చాయని ఆయన పేర్కొన్నారు.