ముంబై, ఏప్రిల్ 6 : అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంతో గల్ఫ్ దేశాలు భగ్గుమంటున్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఈ ఉద్రిక్తతలు.. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల్ని ఎగదోస్తున్నాయి. ఈ క్రమంలోనే వార్ కొనసాగితే క్రూడాయిల్ రేట్లు మరింత విజృంభిస్తాయన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ‘మిడిల్ ఈస్ట్ సంక్షోభం ముదిరితే ఇప్పుడు 109-110 డాలర్ల వద్ద కదలాడుతున్న పీపా ముడి చమురు ధర.. 130-140 డాలర్ల మార్కు దాటేయగలదు. యుద్ధ తీవ్రత దృష్ట్యా గడిచే ప్రతి వారం చమురు ధరలకు కీలకమే’ అని కొటక్ సెక్యూరిటీస్‌లో కమోడిటీస్, కరెన్సీస్ రిసెర్చ్ అధిపతి అనింధ్య బెనర్జీ ఓ ఇంటర్వ్యూలో అన్నారు.
అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియా దద్దరిల్లుతున్నది. అమెరికా-ఇజ్రాయెల్‌కు అండగా ఉంటున్నాయని సౌదీ అరేబియా, యూఏఈ, బహ్రెయిన్, కువైట్, ఖతార్ తదితర పొరుగు దేశాలపై ఇరాన్ విరుచుకుపడుతున్నది. ఆయా దేశాల్లోని ముడి చమురు, సహజ వాయువు ఉత్పాదక కేంద్రాలే లక్ష్యంగా క్షిపణులను ఎక్కుపెడుతున్నది. దీంతో అక్కడ క్రూడాయిల్, గ్యాస్ ఉత్పత్తి ఆగిపోతున్నది. మరోవైపు కీలకమైన హొర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేసింది. దాడుల భయంతో ఈ మార్గంలో సరుకు రవాణా నౌకలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. ఇది ప్రపంచ చమురు ఉత్పత్తిలో దాదాపు 8-10 శాతాన్ని, గ్యాస్ ఉత్పత్తిలో 15-20 శాతాన్ని ప్రభావితం చేస్తున్నట్టు చెప్తున్నారు. అంతర్జాతీయ విపణిలో క్రూడాయిల్ ధరల పెరుగుదలకూ ఇదే కారణం. ఈ నేపథ్యంలోనే ఈ నెలలో బ్యారెల్ ముడి చమురు ధర 20-30 డాలర్లు పెరుగవచ్చని బెనర్జీ అంచనా వేస్తున్నారు. ఉద్రిక్తతలతో ప్రపంచ ఎకానమీకి ముప్పేనంటున్నారు.
దేశీయ ఇంధన అవసరాల్లో దాదాపు 90 శాతం దిగుమతుల ద్వారానే తీరుతున్నాయి. ఇందులో మెజారిటీ వాటా సౌదీ అరేబియా తదితర గల్ఫ్ దేశాలదే. దీంతో ఈ యుద్ధం.. భారత్‌నూ ప్రభావితం చేస్తున్నది. ఇప్పటికే వంట గ్యాస్ ధరలు పెరిగిన విషయం తెలిసిందే. వివిధ రకాల పెట్రోల్ ధరలూ ఎగిశాయి. ఈ నేపథ్యంలో వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ప్రధాన ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉందని బెనర్జీ అంటున్నారు. త్వరలో 5 శాతం మార్కు దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదని చెప్తుండటం గమనార్హం. మరో 6 నెలలు మిడిల్ ఈస్ట్ సంక్షోభం కొనసాగితే భారత జీడీపీ వృద్ధి అంచనా 7 శాతం నుంచి 6 లేదా 5.8 శాతానికి పడిపోవచ్చన్నారు. ఇరాన్ దెబ్బకు వివిధ గల్ఫ్ దేశాల్లో చమురు, గ్యాస్ ప్లాంట్లకు భీకర నష్టమే వాటిల్లింది. సాధారణ స్థితికి రావడానికి చాలా సమయమే పడుతుందంటున్నారు. ఈ క్రమంలో కొటక్ సెక్యూరిటీస్ అంచనా ఇప్పుడు మిక్కిలి ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్నది.
డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ రికార్డు స్థాయిల్లో నష్టపోతున్నది చూస్తూనే ఉన్నాం. గల్ఫ్ వార్ నేపథ్యంలో దేశీయ కరెన్సీ తీవ్ర ఒత్తిడికి గురవుతున్నది. ఈ క్రమంలోనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) జోక్యంతో ఇటీవల కాస్త బలపడింది. అంతకుముందు తొలిసారి 95 మార్కు ఎగువకు ఎక్సేంజ్ వాల్యూ చేరిన సంగతి విదితమే. ప్రస్తుతం 93 దరిదాపుల్లో కదలాడుతున్నది. కాగా, హొర్ముజ్ జలసంధిలో ప్రతిష్ఠంభన కొనసాగితే రూపాయి మరింతగా నష్టపోగలదని బెనర్జీ అంటున్నారు. గ్లోబల్ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరుగుతుండటంతో దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్ ఏర్పడుతున్నది మరి. మరోవైపు అమెరికా సైతం మాంద్యం గుప్పిట్లోకి వెళ్లే వీలుందన్న సంకేతాలిచ్చారు. అయితే యుద్ధంలో 45 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరితే కొంత ఊరట ఉంటుందన్న అభిప్రాయాన్ని బెనర్జీ ఈ సందర్భంగా వెలిబుచ్చారు. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ రేటు 80-85 డాలర్లకు రావచ్చన్నారు. అయినప్పటికీ ఒడిదుడుకులు మాత్రం కొనసాగుతాయని స్పష్టం చేశారు.