Crude Oil | దేశీయ అవసరాలకు అనుగుణంగా గత నెల క్రూడాయిల్ దిగుమతుల్లో మిడిల్ ఈస్ట్ దేశాల వాటా పెరిగింది. గతంతో పోలిస్తే తొమ్మిది నెలల గరిష్టానికి చేరింది. ఉక్రెయిన్‌తో యుద్ధం తర్వాత రష్యా వద్ద రాయితీ ధరపై భారత్ ముడి చమురు కొనుగోలు చేస్తున్నది. ఉక్రెయిన్ మీద యుద్ధానికి నిధుల కొరత కల్పించేందుకు రష్యా నుంచి క్రూడాయిల్ కొనుగోలుపై పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించాయి. కానీ గత నెలలో రష్యా నుంచి క్రూడాయిల్ దిగుమతి తగ్గింది. రష్యా నుంచి అక్టోబర్ నెలలో రోజుకు 1.51 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు దిగుమతి చేసుకుంటే నవంబర్ నెలలో 13 శాతం తగ్గింది.
అదే సమయంలో మిడిల్ ఈస్ట్ నుంచి గత నెలలో ప్రతి రోజూ 2.28 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు దిగుమతి జరిగింది. అక్టోబర్ నెలతో పోలిస్తే 10.8 శాతం ఎక్కువ. దేశీయ దిగుమతుల్లో సుమారు 48 శాతం అని అధికార వర్గాల కథనం. భారత్ ఆయిల్ రిఫైనరీలు తమ వార్షిక కాంట్రాక్టులకు అనుగుణంగా మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి ముడి చమురు దిగుమతి చేసుకున్నాయి. అదే సమయంలో రష్యా నుంచి తగ్గించాయి. రష్యాలోనూ స్థానిక రిఫైనరీల నుంచి అధిక డిమాండ్ రావడంతో రష్యా నుంచి ముడి చమురు ఎగుమతులు తగ్గుముఖం పట్టాయి.