న్యూఢిల్లీ, జూన్ 11 : అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం మరోసారి తీవ్రరూపం దాల్చింది. దాదాపు మూడున్నర నెలలుగా (ఈ ఏడాది ఫిబ్రవరి 28న యుద్ధం మొదలైంది) సాగుతున్న ఈ పోరు.. ఇప్పుడప్పుడే ఆగే అవకాశాలు కనిపించడం లేదు. ఆ మధ్య శాంతి కోసం చర్చలు, కాల్పుల విరమణ ఒప్పందం అంటూ తగ్గిన ఇరు వర్గాలు.. మళ్లీ దాడులు, ప్రతిదాడులకు తెగబడుతున్నాయి. తాజాగా ఇరాన్‌పై అమెరికా మిస్సైళ్ల వర్షం కురిపించింది. దీంతో ఇరాన్ సైతం కువైట్, బహ్రెయిన్‌లోని అమెరికా స్థావరాలే లక్ష్యంగా డ్రోన్లతో విరుచుకుపడింది. అంతేగాక హొర్ముజ్ జలసంధిని మూసేసింది. ఫలితంగా ఇప్పుడున్న పరిస్థితులనుబట్టి త్వరలోనే బ్యారెల్ ముడి చమురు ధర 150 నుంచి 200 డాలర్లకు చేరగలదన్న అంచనాలు జోరుగా వినిపిస్తున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ముడి చమురు ఉత్పత్తిలో గల్ఫ్ దేశాల (కువైట్, బహ్రెయిన్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ) వాటానే 26-29 శాతంగా ఉన్నది. ఈ నేపథ్యంలో ప్రస్తుత అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ వార్.. ఆయా దేశాల్లో క్రూడాయిల్ ఉత్పత్తికి తీవ్ర విఘాతం కలిగిస్తున్నది. అమెరికాకు అండగా ఉంటున్నాయని గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు చేస్తున్నది మరి. ముడి చమురు, సహజ వాయువు ఉత్పాదక ప్లాంట్లను దెబ్బ తీస్తున్నది. మరోవైపు హొర్ముజ్ జలసంధిని కూడా ఇరాన్ మూసేసింది. సాధారణంగా రోజుకు ఈ జలసంధి మీదుగా దాదాపు 20 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు, ఇతర పెట్రోలియం ఉత్పత్తుల రవాణా జరుగుతూ ఉంటుంది.
ప్రపంచ క్రూడ్, పెట్రోలియం సరఫరాల్లో ఇది సుమారు 20-25 శాతానికి సమానం. భారత్, చైనా సహా ఇతర దేశాలకు గల్ఫ్ ఉత్పత్తులు చేరేది ఈ మార్గం ద్వారానేనన్న విషయం తెలిసిందే. అందుకే ఈ యుద్ధంలో హొర్ముజ్‌ను ఇరాన్ వ్యూహాత్మకంగా వాడుకుంటున్నది. ఇక అటు ఉత్పత్తికి, ఇటు రవాణాకు బ్రేకులు పడటంతో డిమాండ్‌కు తగ్గ సరఫరా లేక సహజంగానే అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు పెరుగుతున్నాయి. బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ రేటు మళ్లీ 100 డాలర్ల దిశగా పరుగులు పెడుతున్నదిప్పుడు. ఆ మధ్య కూడా యుద్ధం తీవ్రరూపం దాల్చడంతో బ్యారెల్ 125 డాలర్లు పలికిన సంగతి విదితమే.
దేశీయ ఇంధన అవసరాల్లో 85-88 శాతం (ఏటా దాదాపు 142 బిలియన్ డాలర్ల విలువైనవి) దిగుమతుల ద్వారానే తీరుతున్నాయి. పెట్రోల్, డీజిల్ తదితర ఇంధనాల వినియోగంలో ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉన్న భారత్.. క్రూడాయిల్ దిగుమతుల్లో రెండో స్థానంలో ఉన్నది. అయితే ఈ దిగుమతుల్లో 55-65 శాతం వాటా గల్ఫ్ దేశాలదే. దీంతో యుద్ధ ప్రభావం భారత్‌పై గట్టిగానే పడుతున్నది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్, సీఎన్జీ, జెట్ ఇంధనాలతోపాటు వంటగ్యాస్ ధరల్ని పెంచినది తెలిసిందే. మోదీ సర్కార్ సంకేతాలతో లీటర్ పెట్రోల్, డీజిల్‌పై సుమారు రూ.8, గృహావసరాల వంటగ్యాస్‌పై దాదాపు రూ.90 చొప్పున ధరల్ని ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు పెంచేశాయి. అయినప్పటికీ ఇంకా నష్టాల్లోనే ఉన్నామని చమురు మార్కెటింగ్ కంపెనీలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలు.. మరింతగా రేట్లను ఎగదోసే వీలుందన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
గ్లోబల్ మార్కెట్లో బ్యారెల్ క్రూడాయిల్ ధర 150-200 డాలర్లకు ఎగబాకితే.. దేశీయ మార్కెట్లో అన్ని రకాల ఇంధనాల రేట్లు భగ్గుమనడం ఖాయంగానే కనిపిస్తున్నది. ఇదే జరిగితే ద్రవ్యోల్బణం అదుపు తప్పుతుంది. ఇప్పటికే రిటైల్, హోల్‌సేల్ ద్రవ్యోల్బణం గణాంకాలు విజృంభిస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇటీవలి ద్రవ్య సమీక్షలో వడ్డీరేట్ల జోలికి వెళ్లకపోయినప్పటికీ.. రాబోయే సమీక్షల్లో మాత్రం పెంపునకు వీలుందనే ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. దీంతో గృహ, వాహన, వ్యక్తిగత రుణాలు ప్రియమవుతాయని, బ్యాంకులు వడ్డీరేట్లు పెంచితే ఈఎంఐలు భారంగా మారుతాయని అంటున్నారు. అంతిమంగా వినియోగదారుల కొనుగోలు శక్తి దెబ్బతిని మార్కెట్లో స్తబ్దత ఏర్పడుతుందని, తయారీ రంగం కుదేలై.. చివరకు దేశ జీడీపీ వృద్ధిరేటు పడిపోతుందన్న ఆందోళనల్ని ఎక్స్పర్ట్స్ కనబరుస్తున్నారు.
డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ క్షీణత, కరిగిపోతున్న ఫారెక్స్ రిజర్వులు, పెరిగిపోతున్న కరెంట్ ఖాతా లోటు వంటివి.. దేశ ఆర్థిక వ్యవస్థకు పొంచి ఉన్న ముప్పుగానే వారంతా హెచ్చరిస్తుండటం గమనార్హం. మరోవైపు చమురు సంక్షోభం దృష్ట్యా ఇథనాల్, పెట్రోల్ మిక్స్డ్ ఇంధనాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. ఈ10 (ఇథనాల్ 10%, పెట్రోల్ 90%), ఈ20 (ఇథనాల్ 20%, పెట్రోల్ 80%), ఈ85 (ఇథనాల్ 85%, పెట్రోల్ 15%) రకాల ఇంధనాల వాడకం పెరిగేలా చేస్తున్నది. ఇందుకు తగ్గట్టుగా వాహన తయారీని మార్చాలనీ ఆటో రంగ సంస్థలనూ కోరుతున్నది. వీటి వినియోగంతో చమురు దిగుమతులపై ఆధారపడే పరిస్థితి తగ్గుతుందని, కాలుష్యం కూడా నియంత్రణలో ఉంటుందని సర్కారీ పెద్దలు చెప్తున్నారు. అయితే ఇప్పటికిప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థపై పడుతున్న ఒత్తిడి, దుష్ప్రభావాలను తొలగించాలంటే పెట్రోల్, డీజిల్ తదితర ఇంధనాలపై కేంద్ర ప్రభుత్వం వేస్తున్న పన్నులు తగ్గాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. బంకుల్లో పెట్రోల్ అమ్మకం ధరలో 50-55 శాతం, డీజిల్ రిటైల్ రేటులో 50-60 శాతం వాటా పన్నులదే. మరింత వివరంగా చెప్పాలంటే లీటర్ పెట్రోల్, డీజిల్‌పై రూ.60వరకు వాహనదారులు పన్నుల కిందే చెల్లిస్తున్నారు. సంక్షోభ పరిస్థితుల్లోన్నైనా పన్నుల భారాన్ని తగ్గిస్తే.. దేశానికి మేలు జరుగుతుందని హితవు పలుకుతున్నారు.
గల్ఫ్ యుద్ధం మొదలవగానే.. బ్యారెల్ ముడి చమురు ధర ఇక 200 డాలర్లకు చేరినట్టేనన్న అంచనాలు అంతటా పెద్ద ఎత్తున వినిపించాయి. అయితే వార్.. నాల్గో నెలలోకి ప్రవేశించినా ఆ మార్కును ఎప్పుడూ గ్లోబల్ క్రూడాయిల్ రేటు చేరనేలేదు. కచ్చితంగా చెప్పాలంటే ఇప్పుడు కూడా 100 డాలర్ల దిగువనే కదలాడుతున్నది. మరి ఈ అంచనాలు తలకిందులు కావడానికి కారణం ఏంటి? అన్నదానికి వెళ్తే.. కనిపించే ఒకే ఒక్క సమాధానం చైనా. అవును.. ప్రపంచ ఇంధన వినియోగంలో, ముడి చమురు దిగుమతుల్లో ముందుండే చైనా.. భారీ ఎత్తున అటు వినియోగాన్ని, ఇటు దిగుమతుల్ని తగ్గించేసుకున్నది. అందుకే భయపడినంత స్థాయిలో మార్కెట్లో రేట్ల పెరుగుదల లేదని విశ్లేషకులు చెప్తున్నారు. గత నెల మేలో చైనా క్రూడాయిల్ దిగుమతులు రోజుకు 7.8 మిలియన్ బ్యారెళ్లుగానే ఉన్నాయి. సాధారణంగా 11 మిలియన్ బ్యారెళ్లుగా ఉండేవి.
3 మిలియన్ బ్యారెళ్లు తగ్గాయి. ఇటలీ, ఫ్రాన్స్ రెండు దేశాల చమురు వినియోగానికి ఇది సమానం కావడం గమనార్హం. ఇక ఈ రేంజ్లో దిగుమతులు తగ్గడం వెనుక చైనా అవలంబిస్తున్న వ్యూహాత్మక విధానాలున్నాయి. దేశవ్యాప్తంగా భారీ ఎత్తున ఉన్న చమురు నిల్వల్ని ఈ సంక్షోభం సమయంలో వినియోగంలోకి తెస్తున్న చైనా.. విద్యుత్తు ఆధారిత రవాణాను విపరీతంగా ప్రోత్సహిస్తున్నది. ఇంధన ఆధారిత కార్లు, విమానాలకు బదులుగా ఈవీలు, ట్రెయిన్లను అక్కడి ప్రజలు వినియోగిస్తున్నారు. చైనా రిఫైనరీలూ చమురు శుద్ధి ప్రక్రియను తగ్గించేశాయి. కీలకమైన పరిశ్రమలకు తప్ప.. ఇంధన వినియోగం పెద్దగా ఉండట్లేదు. దీంతోనే మిడిల్ ఈస్ట్ సంక్షోభం ప్రభావం.. భారత్ కంటే చైనాలో తక్కువగా కనిపిస్తున్నదని, మార్కెట్లో ఇంధన ధరల స్థిరీకరణకూ దోహదం చేసిందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అయితే యుద్ధం త్వరలో ముగియకపోయినా, చైనా దిగుమతులు పెరిగినా ప్రపంచ ఆర్థిక మాంద్యం తప్పదనీ హెచ్చరిస్తున్నారు.